
న్యూఢిల్లీ: ఐపీఎల్–18లో ఎదురవుతున్న వరుస పరాజయాలపై చెన్నై సూపర్‌కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. లీగ్‌లో ఇప్పటివరకు సాధారణ విజయాలు సాధించినప్పటికీ.. జట్టు ఓటములపై పెద్దగా ఆందోళన చెందడం లేదన్నారు. ‘మేం ఎప్పుడూ పానిక్ బటన్‌ను నొక్కము. ఇది ఒక ఆట మాత్రమే. మా స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్ ఇవ్వడం లేదు. ప్రతి మ్యాచ్‌లో మెరుగుపడటానికి ప్రయత్నిస్తున్నాం. రాబోయే మ్యాచ్‌ల్లో అన్ని విభాగాల్లో రాణించేందుకు కృషి చేస్తాం. ప్లే ఆఫ్స్‌పై ఇంకా ఆశలు వదులుకోలేదు’ అని కాశీ పేర్కొన్నారు.
రుతురాజ్ గైక్వాడ్ గైర్హాజరీతో తిరిగి సారథ్యం చేపట్టిన ధోనీ కూడా టీమ్‌ను విజయాలబాట పట్టించలేకపోతున్నాడు. దీనిపై స్పందించిన చీఫ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. ‘మహీ వద్ద మంత్రదండం లేదు. రాత్రికి రాత్రే జట్టు అదృష్టాన్ని మార్చలేడు. గాడిలో పడేందుకు కొంత సమయం పడుతుంది. 2026 గురించి ఇప్పుడే మాట్లాడలేం. ఇది ఏ ఒక్కరి ప్రశ్న కాదు. ఒక వ్యక్తి కాకుండా జట్టు మొత్తం రాణిస్తేనే విజయాలు దక్కుతాయి. జట్టుకు అవసరమైందే ధోనీ చేస్తాడు’ అని ఫ్లెమింగ్ వెల్లడించాడు.