పోస్టల్ బ్యాలెట్లకు మరో అవకాశం... ముఖేష్ కుమార్ మీనా

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టం మొదలైంది.ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఈ నెల 7, 8వ తేదీల్లో మరో అవకాశం ఉంటుందని సీఈఓ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన అయన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను, ఏర్పాట్లను పరిశీలించారు. 

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన మీనా, ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించటమే తమ లక్ష్యమని అన్నారు.పోస్ట‌ల్ ఓట‌ర్ల జాబితాలో పేర్లు లేనివారు, ఓటు కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోని వారు సైతం త‌మ ఎన్నిక‌ల‌ డ్యూటీ ఆర్డ‌ర్‌, గుర్తింపు కార్డుతో ఫెసిలిటేష‌న్ సెంట‌ర్‌కు వెళ్లి, ఓటు పొంద‌వ‌చ్చున‌ని సూచించారు. ఇలాంటి వారి కోసం ఈ నెల 7,8 తేదీల్లో ఓటు వేయ‌డానికి అవ‌కాశం ఇస్తామ‌ని తెలిపారు. అన్నిఫెసిలిటేష‌న్ సెంట‌ర్ల‌లో క‌నీస మౌలిక స‌దుపాయాల‌ను, హెల్ప్ డెస్క్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప‌క్కా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు ముకేశ్ కుమార్ మీనా.