లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35 వేల 808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీ చేస్తుండగా.. ఇందులో 285 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు.
ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీచేస్తు్న్నారని.. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నట్లుగా వెల్లడించారు. కొన్ని చోట్ల రెండు, మూడు బ్యాలెట్లు వాడుతున్నామని.. ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు వాడాల్సి వస్తుందని చెప్పారు. 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు వాడాల్సి వస్తుందన్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ఒక ఈవీఎం సరిపోతుందని వికాస్‌రాజ్ చెప్పుకొచ్చారు. ఈసీకి చెప్పి అదనంగా కొన్ని ఈవీఎంలు రప్పిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ఫిర్యాదులకు 1950 ఏర్పాటు చేశామని తెలిపారు.