కౌంటింగ్ కు మూడంచెల భద్రత

కౌంటింగ్ కు మూడంచెల భద్రత
  •  మధ్యాహ్నం 3 లోపు ఫలితాల వెల్లడి
  •  అత్యధికంగా 24, అత్యల్పంగా 13 రౌండ్లు
  •  జూన్ 4వ తేదీన లిక్కర్ షాపులు బంద్
  •  276 టేబుళ్లపై 2.80 లక్షల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
  •  ఆ రోజు కౌంటింగ్ విధుల్లో 15వేల మంది ఉద్యోగులు
  •  ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం
  •  రేపు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్
  •  5న 24 రౌండ్లలో నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
  •  మీడియాతో సీఈవో వికాస్ రాజ్  

హైదరాబాద్: లోక్ సభ ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఇవాళ బీఆర్కే భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మధ్యాహ్నం 3 గంటలలోపు ఫలితాలు వెలువడుతాయని చెప్పారు. చేవెళ్ల, మల్కాజ్ గిరిల్లో రెండేసి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. లెక్కింపు కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్ లు అనుమతించబోమని అన్నారు. 

కౌంటింగ్ హాలు నుంచి వంద మీటర్ల వరకు ఎవరికీ అనుమతి ఉండదని పేర్కొన్నారు. లెక్కింపు హాలు మొత్తం సీసీ టీవీ పర్యవేక్షణలో ఉంటుందని అన్నారు. స్ట్రాంగ్ రూం నుంచి కౌంటింగ్ హాల్ వరకు ప్రత్యేకమైన దారిలో సీసీ టీవీ మానిటరింగ్ ఉంటుందని అన్నారు. చొప్పదండి, యాకుత్ పురా, దేవరకొండలో అత్యధికంగా 24 రౌండ్ల లో ఓట్లను లెక్కిస్తారని చెప్పారు. ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేలో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు.

 34 లొకేషన్లలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారని అన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుందని అన్నారు.   2.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లను 276 టేబుళ్లపై లెక్కిస్తారని వివరించారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక్కో అబ్జర్వర్ ఉంటారని అన్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీ ప్యాట్లను లెక్కిస్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది సిబ్బంది అవసరమని, యాభై శాతం మందిని అదనంగా స్పేర్ లో పెట్టుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లను ఈసీఐ నియమించిందని అన్నారు. 

లిక్కర్ షాపులు బంద్
కౌంటింగ్ జరిగే జూన్ 4వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు లిక్కర్ షాపులు బంద్ ఉంటాయని చెప్పారు. ర్యాలీలపై స్థానిక పోలీసులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. 

5న పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్
ఈ నెల  5వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ నల్లగొండలో నిర్వహిస్తామని  చెప్పారు. 24 టేబుల్స్ లో కౌంటింగ్ జరుగుతుందని, ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని వికాస్ రాజ్ తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాటు చేశామన్నారు.

రేపు మహబూబ్ నగర్ కౌంటింగ్
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జూన్ 2 (ఆదివారం) జరుతుందని వికాస్ రాజ్ తెలిపారు. ఈ ఓట్ల లెక్కింపు మహబూబ్ నగర్ లోనే ఉంటుందని ఆయన వివరించారు.