- రాష్ట్రంలో ఫస్ట్ టైమ్ హోమ్ ఓటింగ్ జరుగుతున్నది : సీఈఓ వికాస్ రాజ్
- అభ్యర్థుల సంఖ్య ఎక్కువున్న చోట అదనపు బ్యాలెట్ యూనిట్లు
- డీఏపై ఈసీ నుంచి ఇంకా పర్మిషన్ రాలేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2.81 కోట్ల ఓటరు స్లిప్పులను పంపిణీ చేసినట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో, మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పుల పంపిణీ పూర్తవుతుందని చెప్పారు. బీఆర్కే భవన్‌లో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈసారి ఓటరు స్లిప్‌తో పాటు ఓటరు గైడ్ బుక్ లెట్ కూడా ఇస్తున్నట్లు చెప్పారు.
అందులో ఓటు ఎలా వేయాలి? ఫిర్యాదులు ఎలా చేయాలి? అనే సమాచారం ఉంటుందని వివరించారు. ఉద్యోగులకు డీఏ రిలీజ్‌పై ప్రభుత్వం పంపిన ప్రపోజల్స్‌ను ఈసీకి నివేదించామని, అయితే అక్కడి నుంచి ఇంకా ఎలాంటి పర్మిషన్ రాలేదని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 18–19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 9.9 లక్షల మంది ఉన్నారన్నారు.
9 వేల మందికిపైగా ఓటేసిన్రు
రాష్ట్రంలో మొదటిసారి మూడు కేటగిరీల వారికి హోం ఓటింగ్ అవకాశం కల్పించినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. ఇప్పటికే 9 వేల మందికి పైగా ఇలా ఓటు వేశారని చెప్పారు. సర్వీస్ ఓటర్లు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్‌తో ఓటు హక్కు ఉపయోగించుకున్నారని తెలిపారు. ‘‘ఎన్నికల కోసం 36 వేల ఈవీఎంలు సిద్ధం చేశాం. ఇందులో 72,931 బ్యాలెట్ యూనిట్లు, 56,592 కంట్రోల్ యూనిట్లు ఉన్నాయి. అభ్యర్థుల సంఖ్య పెరగడం వల్ల కొన్ని చోట్ల రెండు, మూడు, నాలుగు కూడా బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నాం.
పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య 16 దాటిన చోట అదనంగా ఇంకో బ్యాలెట్ యూనిట్ అవసరం ఉంటుంది. పోలింగ్ సిబ్బందికి పోలింగ్ కేంద్రంలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తాం” అని వివరించారు. ఆరు నియోజకవర్గాల్లో 5 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఎన్నికల కోసం ఈవీఎంలను హైదరాబాద్‌లోని ఈవీ కాలేజీ డీఆర్సీ కేంద్రంలో ఎన్నికల అధికారులు కమిషనింగ్ చేస్తున్నట్లు చెప్పారు.
రూ.669 కోట్లు సీజ్
ఈవీఎం బ్యాలెట్ పేపర్లు 8 లక్షల 84 వేలు ప్రింట్ అయ్యాయని వికాస్ రాజ్ తెలిపారు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముగ్గురు స్పెషల్ అబ్జర్వర్లు వచ్చారని చెప్పారు. వీరు కాకుండా ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు ఒక అబ్జర్వర్ ఉంటారని తెలిపారు. ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీలకు 37 వేల వరకు అనుమతులు ఇచ్చామన్నారు. సీ విజిల్ యాప్ ద్వారా 6,600 ఫిర్యాదులు అందాయన్నారు.
ALSO READ : తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ సర్కారే : గంగుల కమలాకర్
ఇప్పటి వరకు అన్ని రకాలుగా కలిపి రూ.669 కోట్లు పట్టుబడిందని వివరించారు. 774 ఎఫ్ఐఆర్‌లు ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కింద నమోదయ్యయని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణలో 10 గుర్తింపు పార్టీలు, 114 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయని చెప్పారు.