హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రానుందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి, రానున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనున్నారని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వికాస్ రాజ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం.. వచ్చే ఎన్నికలకు సంసిద్ధతపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భద్రతకు సంబంధించి అంతర్రాష్ట్ర వ్యూహాలపై కూడా చర్చిస్తారని పేర్కొన్నారు.
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు ఆఫీసర్లు పకడ్బందీగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ శాఖ, జీఎస్టీ, ఇతర డిపార్ట్‌మెంట్లతో కో ఆర్డినేట్ చేసుకుంటూ సరిహద్దు చెక్ పోస్టులను మ్యాపింగ్ చేసుకోవాలని సూచించారు.