సర్టిఫికెట్ సరిపోదు .. స్కిల్స్​​ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

సర్టిఫికెట్ సరిపోదు .. స్కిల్స్​​ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి
  • 2 వేల కోట్లతో 65 ఐటీఐలను తీర్చిదిద్దుతం: సీఎం
  • రోబోలు మొదలుకుని అత్యాధునిక యంత్రాలతో శిక్షణ ఇప్పిస్తం 
  • పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి  కల్పించడమే లక్ష్యం
  • ప్రస్తుత విద్యావిధానం 40 ఏండ్ల కిందటిది.. నేటి పరిస్థితులకు 
  • తగ్గట్టు ఏటీసీల ఏర్పాటువిద్యార్థులు ఐటీఐల్లో చేరాలి.. 
  • ఈ శాఖను నేనే స్వయంగా చూసుకుంటా
  • మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్​డ్​ ట్రైనింగ్​సెంటర్​కు సీఎం రేవంత్​ శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు: నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికెట్​ మాత్రమే​ఉంటే ప్రయోజనం లేదని, సర్టిఫికెట్​తోపాటు స్కిల్స్​ ఉంటేనే ఎక్కడైనా రాణించగలమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.  టెక్నికల్​ నాలెడ్జ్​ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఐటీఐలను అడ్వాన్స్​డ్​ ట్రైనింగ్ ​సెంటర్​ (ఏటీసీ)గా అప్​గ్రేడ్​ చేయాలని కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ​హైదరాబాద్​లోని మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీకి సీఎం రేవంత్​రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సమాజం చాలా వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నదని చెప్పారు. కానీ మన విద్యా విధానం మాత్రం 40 ఏళ్ల క్రితం పరిస్థితులకు చెందినదిగా ఉందని తెలిపారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దటం కోసమే ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.  స్కిల్స్​ లేకపోవడంతో యువత ప్రైవేట్​రంగంలోని ఇతర ఉద్యోగాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పటికీ లక్షల మంది యువత టీజీపీఎస్సీ, మెడికల్​ బోర్డు, పోలీస్​ రిక్రూట్​మెంట్​బోర్డు వైపు చూస్తున్నారని తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు.  

కేవలం సర్టిఫికెట్స్​ జీవన ప్రమాణాలను పెంచవని అన్నారు. దుబాయ్ లాంటి దేశాలకు వలసలు వెళ్లకుండా తమ ప్రభుత్వం ఉపాధి గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలు తీసుకువచ్చి యువతకు శిక్షణ అందించాలని భావిస్తున్నామని తెలిపారు. టాటా సంస్థ సహకారంతో సాంకేతిక నైపుణ్యాల కోసం రూ.2,324 కోట్లతో 65 ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని వెల్లడించారు. 40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్​మెంట్​ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్ర  సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలక పాత్ర పోషించిందని, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్​ చెప్పారు.   

విద్యార్థులు ఐటీఐల్లో చేరాలి

రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు నిరుపయోగంగా మారాయని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఐటీఐల్లో 40, 50 ఏండ్ల కిందటి నైపుణ్యాలను నేర్పిస్తున్నారని, అవి విద్యార్థులకు ఉపయోగపడడం లేదని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని, ఏటీసీ తన ఆలోచనల నుంచి వచ్చిందేనని పేర్కొన్నారు. ‘‘ మేం పాలకులం.. మీరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదు. మేం సేవకులం”అని  అన్నారు. ఐటీ రంగంలో ప్రపంచంతో మన తెలుగువాళ్లు పోటీ పడుతున్నారని చెప్పారు. మధ్య, దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పించడమే తమ బాధ్యత అని రేవంత్​రెడ్డి పేర్కొ న్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దుతామని, అధునాతన నైపుణ్యాలను నేర్పించడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు ఐటీఐలో చేరాలని, ఈ శాఖ తన దగ్గరే ఉంటుందని చెప్పారు. తానే పర్యవేక్షించి.. ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని రేవంత్​ రెడ్డి తెలిపారు.  విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

ఏటీసీలుగా ఐటీఐలు 

ఐటీఐలను అడ్వాన్స్​డ్​ ట్రైనింగ్ ​సెంటర్లు(ఏటీసీ)గా అప్​గ్రేడ్​ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,324.21 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్​గ్రేడ్​ చేయనున్నారు. ఏటీసీలుగా మార్చేందుకు రెండు నెలల క్రితమే టాటా టెక్నాలజీస్​ లిమిటెడ్​తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆధునిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఏటీసీల్లో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నాలెడ్జ్​​సెంటర్స్​లో అధునాతన సామగ్రి, సాంకేతికత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించారు. ఈ కేంద్రాల్లో ఏటా 15,860 మందికి ఆరు రకాల కోర్సుల్లో లాంగ్​ టర్మ్​ కోచింగ్​ ఇవ్వనున్నారు. అలాగే, 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్​టర్మ్​ కోచింగ్​ ఇస్తారు. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.307.96 కోట్లు, టీటీఎల్​ వాటా రూ.2016.25 కోట్లుగా ఉంది. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్​ ఉద్యోగావకాశాలు కల్పించనుంది.

ప్రభుత్వ ఐటీఐలు నిరుపయోగంగా మారాయి. వాటిల్లో 40, 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. అవి విద్యార్థులకు ఉపయోగపడడం లేదు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఐటీ రంగంలో ప్రపంచంతో మన తెలుగువాళ్లు పోటీ పడుతున్నారు. మధ్య, దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పించడమే మా బాధ్యత. మేం పాలకులం.. మీరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదు. 
మేం సేవకులం.
- సీఎం రేవంత్​రెడ్డి