- తహసీల్దార్ డిజిటల్ కీ దుర్వినియోగం
- 57 మంది స్థానికేతరులకు ఇన్ కం సర్టిఫికెట్స్ జారీ
- మీసేవ నిర్వాహకుడితో పాటు సిస్టమ్ ఆపరేటర్‌పై పోలీసులకు కంప్లైంట్
రంగారెడ్డి, వెలుగు : రంగారెడ్డి జిల్లా మంచాల తహసీల్దార్ డిజిటల్ కీని దుర్వినియోగం చేసి 57 మంది స్థానికేతరులకు సర్టిఫికెట్లను జారీ చేశారు. తనకు తెలియకుండా సర్టిఫికెట్లు జారీ చేయడంతో ఈ విషయంపై తహసీల్దార్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తహసీల్దార్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వనస్థలిపురంలో ఉన్న ఓ మీసేవ సెంటర్ నిర్వాహకుడు రవి, మంచాల తహసీల్దార్ ఆఫీస్‌లో ఔట్ సోర్సింగ్‌పై పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సురేశ్‌కుమార్ కలిసి ఈ దందాకు పాల్పడ్డారు.
ఇలా మంచాల మండలానికి సంబంధం లేని 57 మందికి ఇన్‌కం సర్టిఫికెట్లు జారీ చేశారు. సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉండే వారి నుంచి వేల రూపాయలు తీసుకుంటూ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేసి, వీరిద్దరూ పంచుకున్నట్లు చెబుతున్నారు. మీ సేవలో అప్లై చేసుకున్నాక, డాక్యుమెంట్లను ఎంక్వైరీ చేసిన తరువాత సరైందని తేలితేనే సర్టిఫికెట్ జారీ చేస్తారు.
అయితే మీ సేవ నుంచి రవి అప్లికేషన్ అప్లోడ్ చేయగానే, ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే తహసీల్దార్ డిజిటల్ కీని దుర్వినియోగం చేసి సురేశ్‌కుమార్ అప్రూవల్ ఇచ్చేవాడు. ఎన్నికలు, వివిధ ప్రోగ్రామ్స్‌లో బిజీగా ఉన్న సమయంలో అత్యవసరంగా సర్టిఫికెట్లు జారీ చేసేందుకు డిజిటల్ కీని కంప్యూటర్ ఆపరేటర్‌కు అప్పగించగా, ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేశాడు.
బయట పడిందిలా..
మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి ఒక ఇన్‌కం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పంపించగా, దానికి సంబంధించిన ఫిజికల్ డాక్యుమెంట్లు లేకపోవడంతో తహసీల్దార్ తాను అప్రూవల్ ఇచ్చిన సర్టిఫికెట్లపై ఎంక్వైరీ చేశారు. ఇలా అనేక మందికి తన డిజిటల్ కీతో సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తహసీల్దార్ గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రవి, సురేశ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే సర్టిఫికెట్లపై ఎంక్వైరీ చేస్తున్న విషయాన్ని గుర్తించిన కంప్యూటర్ ఆపరేటర్ సురేశ్‌కుమార్ పరారయ్యాడు.
నేనే గుర్తించి కంప్లైంట్ చేశాను..
మైనారిటీ వెల్ఫేర్ నుంచి ఒక ఇన్‌కం సర్టిఫికెట్ రీ వెరిఫికేషన్ కోసం వచ్చింది. ఫిజికల్ డాక్యుమెంట్స్ ఆఫీస్ కు రాకుండానే నా లాగిన్ తో అప్రూవల్ ఇచ్చినట్లు గుర్తించాను. అనుమానంతో అన్ని సర్టిఫికెట్లను పరిశీలిస్తే, 57 సర్టిఫికెట్లు నాకు సంబంధం లేకుండా అప్రూవల్ అయినట్లు గుర్తించాను. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించాను.
- ప్రసాద్, తహసీల్దార్, మంచాల