ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతపై 70 వేల 729 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పార్టీ ఏర్పాటు చేసిన పదేండ్ల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పవన్ . పీకే గెలుపు అంతా ఈజీ కాదని అందరూ అన్నప్పటికి.. ప్రభుత్వంపై వ్యతిరేకత, కాపు ఓట్లు, యూత్, మహిళల ఓట్లు వంటి అంశాలు పవన్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. పిఠాపురం నుంచిఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచినట్టుగా రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం ఈ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సూపర్ హిట్ అయింది. ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయగా మొత్తం సీట్లలో విజయం సాధించింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశంలో ఏ పార్టీ కూడా పోటీ చేసిన ప్రతి చోటా 100 శాతం విజయాన్ని ఇప్పటిదాకా అందుకోలేదని తెలిపారు.
ఫలితాల తర్వాత మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘విజయాన్ని బాధ్యతగా భావిస్తాను. ప్రజల ఆకాంక్షల కోసం పని చేస్త. వైసీపీపై కక్ష సాధింపు చర్యలు ఉండవు. రాష్ట్రంలో చీకటి రోజులు పోయాయి.చాలా జాగ్రత్తగా ప్రజలకు జవాబుదారీగా పాలన అందించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. తర్వాత టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పవన్ భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.