
సర్వైకల్ క్యాన్సర్.. అన్ని క్యాన్సర్లలా కాదు. దీన్ని నయం చేయొచ్చు. రాకుండా అడ్డుకోవచ్చు. దీన్ని కనుక్కున్న సైంటిస్ట్‌కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అయినా సరే.. వ్యాధి విస్తరిస్తోంది. అందుకే ఇప్పుడు ‘వ్యాధి ఏదైనా సరే.. అది మన దరి చేరకముందే అడ్డుకట్ట వేస్తే నిశ్చింతగా ఉండొచ్చు. అందుకు క్యాన్సర్ కూడా అతీతం కాదు’ అంటున్నారు డాక్టర్లు. మరీ ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్‌కు వ్యాక్సిన్ ఉంది. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల నూటికి 80 శాతం సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు.
ఈనెల 22న మొదలైన సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ప్రోగ్రామ్ మొదలైంది. ఈ సందర్భంగా అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? వ్యాక్సిన్ ఎవరు వేయించుకోవాలి.. వంటి విషయాల గురించి నేటి హెల్త్ స్టోరీ.
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్లలో సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ నాలుగో స్థానంలో ఉంది. మనదేశంలో సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో రెండోది సర్వైకల్ క్యాన్సర్. ఈ మధ్యకాలంలో సర్వైకల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగింది. దాంతో చాలామంది ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ, ఇంకా దీని గురించి తెలియని వాళ్లు మరెందరో ఉన్నారు.
సాధారణంగా ప్రత్యుత్పత్తి అవయవాలు, వాటి ఆరోగ్యం గురించి మాట్లాడడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ, సమస్య బయటకు చెప్పకపోతే నష్టపోయేది మనమే. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా అనుమానంగా ఉన్నప్పుడు దాన్ని గుర్తించడం ఎంత ముఖ్యమో, దాన్నుంచి బయటపడేందుకు మార్గాలు వెతకడమూ అంతే ముఖ్యం అంటున్నారు డాక్టర్లు. అప్పుడే సరైన చికిత్స అందించగలుగుతాం అని చెప్తున్నారు.
ఆ వైరస్ వల్లే ఈ క్యాన్సర్
సర్వైకల్ క్యాన్సర్ అంటే.. గర్భాశయ ముఖ ద్వారంలో వచ్చే క్యాన్సర్. ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల వస్తుంది. ఈ వైరస్ కలయికలో పాల్గొనడం మొదలైనప్పటి నుంచి పార్టనర్స్ ఇద్దరికీ ఎప్పుడైనా అటాక్ అవ్వొచ్చు. ఒకసారి ఈ వైరస్ అటాక్ అయితే అది ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ కాస్త దీర్ఘకాలంలో క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది.
అయితే, సాధారణంగా వచ్చే హెచ్‌పీవీ వైరస్ 30 ఏండ్లు వచ్చేసరికి శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ వల్ల వాటంతటవే నశించిపోతాయి. కానీ, హై–రిస్క్ హెచ్‌పీవీ అనేది మాత్రం క్యాన్సర్‌కి దారితీస్తుంది. ఈ వైరస్ ఒక్కటి కాదు.. ఇందులో తొమ్మిది రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి, క్యాన్సర్‌కి కారణమయ్యేవి రెండు.. అవి హెచ్‌పీవీ 16, 18 రకాలు. కొందరిలో ఈ క్యాన్సర్ కారకాలు కనిపిస్తాయి.
వ్యాక్సిన్ తీసుకుంటే..
శరీరంలో హెచ్‌పీవీ వైరస్ ఉంటే దాన్ని ఇమ్యూనిటీ సిస్టమ్ గుర్తించి నశింపజేస్తుంది. కానీ కొందరిలో ఈ వైరస్ పది నుంచి ఇరవై ఏండ్లలో మెల్లగా పెరుగుతూ పోతుంది. ఈ టైంలోగానీ ఆ ఇన్ఫెక్షన్ని గుర్తిస్తే క్యాన్సర్‌గా మారకుండానే ఆపేయొచ్చు. వ్యాక్సిన్ తీసుకుంటే 70–95 శాతం నయమవుతుంది. 30 ఏళ్లు పైబడినవాళ్లు స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించుకోవాలి. లక్షణాలు కనిపిస్తే చిన్న చిన్న ట్రీట్మెంట్లతో నయం చేయొచ్చు. సర్జరీ చేశాక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు.
ఇవి కూడా..
శరీరం శుభ్రంగా లేకపోవడం అంటే.. రెండు మూడు రోజులు స్నానం చేయకపోవడం, లోదుస్తులు శుభ్రంగా లేకపోవడం. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ అలవాట్లు, ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉన్నవాళ్లు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీటన్నింటినీ పరిష్కరించుకోవాలి. వ్యాక్సిన్స్ తీసుకోవాలి. లక్షణాలు ఉన్నా, లేకపోయినా స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించుకోవాలి.
రిస్క్...
వయసు పెరిగేకొద్దీ రిస్క్ పెరుగుతుంది. హెచ్‌పీవీ వైరస్ ఎఫెక్ట్ ఉన్నవాళ్లలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఇది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. టీనేజ్ నుంచే సెక్స్‌లో పాల్గొనేవాళ్లలో లేదా ఎక్కువమందితో సెక్స్ చేసేవాళ్లలో మగవారి నుంచి ఆడవారికి సంక్రమించి ఇన్ఫెక్షన్కి దారి తీస్తుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువకాలం శరీరంలో ఉంటే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
సిగరెట్, స్మోకింగ్ కూడా రిస్క్ ఫ్యాక్టర్సే. 25 నుంచి 65 వయసు మధ్యలో ఎవరికైనా రావొచ్చు. స్క్రీనింగ్ చేస్తే తెలుస్తుంది. ఏడాదికొకసారి లేదా మూడేండ్లకు ఒకసారి చేసుకోవచ్చు. పాప్సిమియర్ టెస్ట్ చేశాక పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఎర్లీ స్టేజీలో అయితే సర్జరీ చేస్తారు. 90 శాతం సర్వైవల్ రేటు ఉంటుంది. రేడియేషన్ మాత్రమే ఉంటుంది. రేడియేషన్ తర్వాత ఐదేండ్ల తర్వాత మళ్లీ వస్తుందా? లేదా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. నాలుగో దశలో 30 –40 శాతం మాత్రమే సర్వైవల్ రేటు ఉంటుంది.
క్యాన్సర్ లక్షణాలు..
క్యాన్సర్‌లో నాలుగు దశలు ఉంటాయి. లక్షణాలు లేవని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే కొంతమందికి వ్యాధి ఉన్నా లక్షణాలు ఏవీ కనిపించవు. కొందరికి వ్యాధి ముదురుతున్నప్పుడు మాత్రమే లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఎక్కడ క్యాన్సర్ వచ్చినా ఆ ప్రదేశంలో మొదటి దశలో నొప్పి ఉండదు అని గుర్తుంచుకోవాలి.
సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు.. ఇలా ఉంటాయి.
ఒక నెల పీరియడ్ అయిపోయాక, తర్వాతి నెలలో పీరియడ్ రావడానికి మధ్య కొంత టైం ఉంటుంది. ఆ టైంలో బ్లీడింగ్ అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
పార్ట్నర్స్ కలయిక సమయంలో ఎరుపు, బ్రౌన్, పింక్ కలర్లలో ఏదైనా ఒక రంగులో డిశ్చార్జ్ కావడం.
తెల్లబట్ట అనేది అందరికీ అవుతుంది. కొందరికి పీరియడ్స్ ముందు, అవుతున్నప్పుడు, ప్రెగ్నెన్సీలో కూడా రావొచ్చు. బాగా ఎక్కువగా అవుతుంటే అనుమానించాలి. వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా విడుదలవ్వడం, తెల్ల బట్టలో ఎరుపు రంగులో డిశ్చార్జ్ అవ్వడం. అది చెడు వాసన రావడం. వెన్ను నొప్పి, పొత్తికడుపులో నొప్పి రావడం.మెనోపాజ్ అయిన తర్వాత అంటే వయసురీత్యా పీరియడ్స్ రావడం ఆగిపోయాక.. కొంతకాలానికి ఎప్పుడైనా ఒక్క చుక్క రక్తం వచ్చినా అనుమానించాల్సిందే.
వ్యాక్సిన్ ఎవరికి?
9 నుంచి 45 ఏండ్ల మధ్య ఉన్న వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవాలి.
9 నుంచి15 ఏండ్ల మధ్య పిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వాలి. ఆ వయసులో ఉన్న పిల్లలకు రోగనిరోధక కణాలు త్వరగా పెరుగుతాయి. కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.
18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉన్నవాళ్లు మూడు డోసులు వేయించుకోవాలి. ఇవాళ మొదటి డోసు వేయించుకుంటే రెండు నెలలకు ఒకటి, ఆరు నెలల తర్వాత మరొక డోసు వేయించుకోవాలి.
45 ఏండ్ల వరకు కూడా వ్యాక్సిన్ ఇవ్వొచ్చు. కానీ, ఈ వయసుల్లో ఇస్తే ప్రయోజనం ఎక్కువ.
మ్యారేజ్ చేసుకునే లోపలే లేదా కలయిక జరగకముందే వ్యాక్సిన్ వేయించుకుంటే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. తర్వాత వేయించుకుంటే వ్యాక్సిన్ సామర్థ్యం కాస్త తగ్గొచ్చు.
ఈ వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్లు గ్రామాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్ కాస్త ఖరీదైనది కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాక్సిన్ తీసుకున్నా.. పాప్సిమియర్ టెస్ట్ చేయించుకోవడం మానేయకూడదు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది 70 నుంచి 80 శాతం మాత్రమే తగ్గిస్తుంది. కానీ, రిస్క్ తక్కువ అవుతుంది కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోవాలి.
90-70-90 రూల్
డబ్ల్యూహెచ్ఓ గోల్స్‌లో జెండర్ ఈక్విటీ విభాగంలో మహిళల ఆరోగ్యం కూడా ఉంది. అందులో భాగంగా సర్వైకల్ నిర్మూలించడానికి ఒక లక్ష్యం దిశగా పనిచేయాలని సూచించింది. టార్గెట్ పూర్తి చేసేందుకు 90–70–90 అనే రూల్ ప్రవేశపెట్టింది. దీని అర్థం ఏంటంటే...
90 శాతం మహిళలకు వ్యాక్సిన్ వేయాలి.
70 శాతం మందికి పరీక్షలు చేయాలి.
90 శాతం మందికి ట్రీట్మెంట్ అందాలి.
ఈ రూల్ ప్రకారం పరీక్షలు చేశాక, వచ్చిన ఫలితాలను బట్టి బయాప్సీ (ముఖపరీక్ష) టెస్ట్‌కు పంపాలా? వద్దా? అనేది తెలుస్తుంది. ఆ టెస్ట్ తర్వాత క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందో, లేదో తెలుస్తుంది. దానికి కూడా ఇమ్యూనో కెమిస్ట్రీ అనే కొత్త టెస్ట్ వచ్చింది. ఆ టెస్ట్‌లో క్యాన్సర్‌కి కారణమయ్యే కణాలు గుర్తిస్తే.. ఆ భాగాన్ని తొలగిస్తారు. అంటే కణాలు వ్యాపించి ఉన్న కండ భాగం వరకు తీసేస్తారన్నమాట. దాంతో ఆ ప్రదేశంలో మళ్లీ రాదు.
ఈ ట్రీట్మెంట్ తీసుకున్నవాళ్లు రెగ్యులర్‌గా టెస్ట్ చేయించుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఒకసారి వస్తే.. మరోసారి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి టెస్ట్‌లు చేయించుకోవాలి. మనదేశంలో ఆడవాళ్లు 35 ఏండ్లకు, 40 ఏండ్లకు ఒకసారి తప్పనిసరిగా పాప్సిమియర్ టెస్ట్ చేయించుకోవాలి. క్యాన్సర్ కారకాలు పదేళ్ల తర్వాతే క్యాన్సర్‌గా మారే ఛాన్స్ ఉంది. అదే ఆ కారకాలు ఉన్నాయని ముందే గుర్తిస్తే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. అందుకే 90–70–90 ఫార్ములా అన్నమాట.
- డాక్టర్ బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్, శాలిని హాస్పిటల్స్, హైదరాబాద్