- జిల్లాలో అత్యధికంగా 75.5 శాతం ఆపరేషన్లు
- రాష్ట్రంలో సర్కార్ దవాఖాన్లలోనే ఎక్కువ ప్రసవాలు
- 69 శాతం డెలివరీలు అక్కడే.. అందులో 46% సిజేరియన్లు
- ప్రైవేట్ లో మాత్రం 78 శాతం సిజేరియన్లే
- ఏప్రిల్ నుంచి జూన్ వరకు డేటాతో రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సిజేరియన్ డెలివరీలు తగ్గడం లేదు. నార్మల్ డెలివరీలను పెంచాలన్న లక్ష్యం నీరుగారుతున్నది. సిజేరియన్లే ఎక్కువగా జరుగుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘మెటర్నల్ హెల్త్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ రిపోర్ట్– జూన్, 2023’లో వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరిగిన ప్రసవాలకు సంబంధించిన డేటాను రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నట్టు రిపోర్ట్ వెల్లడించింది. ఆ జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలిపి 75.5 శాతం మేర సిజేరియన్లు జరుగుతున్నట్టు నివేదిక తేల్చింది. అయితే, సర్కార్ దవాఖాన్లలో సిజేరియన్ల విష యంలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. అక్కడ 68.6 శాతం సిజేరియన్లు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జరుగుతున్నాయి.
డెలివరీలు సర్కారులోనే ఎక్కువ
రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులతో పోలిస్తే ప్రభుత్వ దవాఖాన్లలోనే ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నట్టు రిపోర్ట్‌లో తేలింది. సిజేరియన్లు, నార్మల్ డెలివరీలు కలిపి మొత్తం ప్రసవాల్లో 69 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నట్టు వెల్లడైంది. మిగతా31 శాతం డెలివరీలు ప్రైవేటులో జరుగుతున్నాయి. అయితే, ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సిజేరియన్ డెలివరీలు తక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు దవాఖాన్లలో సగటున 46 శాతం సిజేరియన్లు జరుగుతుండగా.. ప్రైవేటులో 78 శాతం ఆపరేషన్ల ద్వారానే డెలివరీలను చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 51 శాతం సిజేరియన్లు నమోదు కాగా.. అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన సిజేరియన్లు 43 శాతం అని తేలింది. ఇది మూడు నెలల సగటు. ఇక, జూన్ నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 67.6, పెద్దపల్లిలో 65.7, జగిత్యాలలో 64.1, జయశంకర్ భూపాలపల్లిలో 63.8, నిర్మల్ జిల్లాలో 62.2 శాతం చొప్పున సిజేరియన్లు జరిగాయి.
టార్గెట్ అందుకోవట్లే..
సిజేరియన్లను తగ్గించేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నా.. కొందరు ముహూర్తాలు, నార్మల్ డెలివరీలంటే భయాల కారణంగా సిజేరియన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో 35 శాతానికి మించి సిజేరియన్లు జరగకుండా చూడాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఉమ్మనీరు తక్కువగా ఉంటేనో.. బ్లీడింగ్ ఎక్కువైతేనో.. కడుపులో బిడ్డ అడ్డం తిరిగితేనో ఒకప్పుడు సిజేరియన్లు చేసేటోళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం సిజేరియన్లు తగ్గినా.. పెట్టుకున్న లక్ష్యం కన్నా ఎక్కువగానే ఉండడం మాత్రం ఆందోళనకర విషయం.