-
54.09 శాతం సర్జరీలతో తెలంగాణ టాప్
-
52.01 శాతంతో తర్వాతి స్థానంలో తమిళనాడు
-
వ్యాసెక్టమీ చేయించుకుంటున్న మగవాళ్లు ఎక్కువైతున్నరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లల్లో సిజేరియన్ (సీ సెక్షన్) కాన్పులు పెరిగాయి. 2020-–21లో 46.3 శాతం సిజేరియన్లు జరగగా, ఆ తర్వాతి ఏడాది 47.13 శాతం ఆపరేషన్లు జరిగాయి. అలాగే, ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు 65.34 శాతం నుంచి 61.08 శాతానికి తగ్గాయి. ప్రైవేటులో కాస్త తగ్గినా.. సర్కారు ఆస్పత్రులతో పోలిస్తే అధికంగానే సిజేరియన్లు జరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసిన హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్‌ఎంఐఎస్) రిపోర్ట్‌లో ఈ విషయం వెల్లడైంది. మరోవైపు, దేశంలో అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో ఉందని తెలిపింది.
అంతకుముందుతో పోలిస్తే సిజేరియన్లు కాస్త తగ్గినా.. దేశ సగటుతో పోలిస్తే అత్యధికంగా ఉన్నాయని పేర్కొంది. 2020–21, 2021–22కు సంబంధించిన డేటాను రిపోర్ట్‌లో వెల్లడించింది. 2020–21లో మొత్తం 55.33 శాతం సిజేరియన్లు నమోదు కాగా, 2021–22లో 54.09 శాతం సిజేరియన్లు జరిగాయి. జాతీయ సగటు 23.29 శాతంతో పోలిస్తే రాష్ట్రంలో జరుగుతున్న సీ సెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణ తర్వాత తమిళనాడు (52.1%), హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ తెలంగాణ తర్వాత ఉన్నాయి. 2020–21లో సిజేరియన్లలో తమిళనాడు (56%) ముందుండగా, 2021–22లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్‌కి చేరింది.
938 మంది ఆడపిల్లలే ఉన్నరు..
రాష్ట్రంలో 2021–22లో 6,06,638 మంది పిల్లలు పుట్టగా.. నెలలు నిండకముందే 7,574 మంది జన్మించారు. కాన్పులోనే 3,334 మంది పిల్లలు చనిపోయారు. కేంద్ర లెక్కల ప్రకారం రాష్ట్రంలో సెక్స్ రేషియో తగ్గుతున్నది. ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు కేవలం 938 మందే ఆడ పిల్లలు పుడుతున్నారు. 2021–22లో 3,13,081 మంది అబ్బాయిలు జన్మించగా.. 2,93,557 మంది అమ్మాయిలు పుట్టారు. దేశ సగటు 934తో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి కాస్తంత మెరుగ్గానే ఉంది. మిజోరాంలో అత్యధికంగా వెయ్యి మంది మగ పిల్లలకు 994 మంది ఆడ పిల్లలు పుడుతున్నారు.
86,960 మంది పిల్లలకు ఆరోగ్య సమస్యలు..
పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లల సంఖ్య రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. పుట్టిన పిల్లల్లో 1,34,919 మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు రిపోర్ట్‌లో కేంద్రం పేర్కొంది. 6 నెలల నుంచి 18 ఏండ్ల లోపు 16,66,860 మంది పిల్లలకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై టెస్టులు చేయగా.. 86,960 మందికి అనారోగ్య సమస్యలు ఉన్నట్టు తేలింది. అందులో 47,475 మందికి ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. పుట్టినరోజే 420 మంది పిల్లలు చనిపోయినట్టు రిపోర్ట్‌లో తేలింది. 4 వారాల్లోపు చనిపోతున్న పిల్లల సంఖ్య 982గా, నెల నుంచి ఏడాది లోపు పిల్లలు 779 మంది చనిపోయినట్టు పేర్కొంది. 2021-–22లో ఏడాది లోపు వయసున్న 2,181 మంది పసి పిల్లలు చనిపోగా, ఏడాది నుంచి ఐదేండ్లలోపు వయసున్న 1,694 మంది పిల్లలు మరణించారు. కాగా, గర్భిణులు, పిల్లలకు టీకాలు ఇవ్వడంలో రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉంది. యాంటీ నాటల్ కేర్‌లో (ఏఎన్‌సీ) రిజిస్టర్ చేసుకున్న గర్భిణుల్లో 90 శాతం మందికిపైగా టీటీ వంటి టీకాలు ఇచ్చారు. 7,46,786 మంది గర్భిణులు ఏఎన్‌సీలో రిజిస్టర్ చేసుకోగా.. 6,77,525 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. 9 నెలల నుంచి 11 నెలల వయసున్న పిల్లలకు వంద శాతం టీకాలను ఇచ్చారు. 6,43,425 మంది పిల్లలకు అన్ని రకాల టీకాలను వేశారు.
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు ఎక్కువైనయ్..
రాష్ట్రంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు రెట్టింపు అయ్యాయి. 2020–21లో 54,141 మంది స్టెరిలైజేషన్ చేయించుకోగా.. ఆ తర్వాతి ఏడాది 95,151 మంది ఆపరేషన్లు చేయించుకున్నారు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించుకుంటున్న మగ వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. 2020–21 లో 2,742 మంది, అంతకు ముందు ఏడాది 1,669 మంది మగవాళ్లు పిల్లలు పుట్టకుండా వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్నారు. 92,409 మంది ఆడవాళ్లు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నారు. ఆపరేషన్లతో పాటు ఐయూసీడీ (ఇంట్రా యుటెరైన్ కాంట్రసెప్టివ్ డివైజ్)లు వాడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది.
సగటున పది వేల మంది పేషెంట్లను చూస్తున్నరు..
రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు (ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మినహాయించి) సగటున ఏడాదికి 9,768 మంది పేషెంట్లను చూస్తున్నట్టు రిపోర్ట్‌లో తేలింది. పీహెచ్‌సీ డాక్టర్లు ఒక్కొక్కరు సగటున 16,283 మందిని చూస్తున్నారని వెల్లడైంది. సీహెచ్‌సీ డాక్టర్లు 9,103, సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ డాక్టర్లు 9,649, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ డాక్టర్లు 4,037 మంది పేషెంట్లను చూస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ రేటు 28.4 శాతంగా ఉంది. దేశ సగటు 49.9తో పోలిస్తే రాష్ట్రంలో బెడ్లు తక్కువగా ఉన్నట్టు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 5,891 ప్రభుత్వ దవాఖాన్లు ఉన్నాయని (మెడికల్ కాలేజీలు మినహాయించి) రిపోర్ట్‌లో వెల్లడైంది. అందులో హెల్త్ సబ్ సెంటర్లు 4,910, పీహెచ్‌సీలు (ప్రైమరీ హెల్త్ సెంటర్లు) 834, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) 82, సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లు 44, డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లు 21 ఉన్నాయి.
గర్భిణులకు ఉచిత మందులు, టెస్టులు ఉత్త ముచ్చట్నే..
గర్భిణులకు ఉచితంగా మందులు అందించేందుకు, టెస్టులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2011లో జనని శిశు సంరక్షణ కార్యక్రమం (జేఎస్‌ఎస్‌కే)ని చేపట్టింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 53.14 శాతం మందికి ఉచితంగా మందులు అందుతుంటే, తెలంగాణలో 10.61 శాతం మంది గర్భిణులకు మాత్రమే అందుతున్నాయి. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాంలలో ఎక్కువ మంది ఈ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్నారు. తక్కువ మంది లబ్ధి పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఇటు ఉచిత డయాగ్నస్టిక్ టెస్టులు కూడా రాష్ట్రంలో కేవలం 7.38 శాతం మంది గర్భిణులకే చేస్తున్నట్లు రిపోర్ట్‌లో తెలింది. జాతీయ సగటు 51.87 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంది. ఈ జాబితాలో మన రాష్ట్రం చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.