నేను సిరిసిల్ల ‘సెస్’ను

నా పక్కా పుట్టినరోజు నవంబర్ 1, 1970.  నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టుబట్టి మంత్రసాని తనం  వహించి నన్ను ఈ భూమి మీదికి తీసుకువచ్చింది. నాటి ప్రఖ్యాత రాజకీయ వేత్త ప్రజా సేవకుడు కీ.శే. చెన్నమనేని రాజేశ్వరరావు. నా పేరు రిజిస్టర్ ప్రకారం విద్యుత్ సరఫరా సహకార సంఘం లి., సిరిసిల్ల. పొడి అక్షరాలలో ‘సెస్ ’ అని నన్ను ఆబాలగోపాలం అందరూ నోరారా పిలుస్తారు. నేను తెలంగాణ రాష్ట్రానికే కాదు జాతీయస్థాయిలో పేరెన్నిక గాంచిన ఏకైక తల్లి సంస్థ గా నాటి నుంచి నేటిదాకా సాటి లేకుండా అలరారుతున్నాను. నేను ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విస్తరించి నా కార్యకలాపాలని దాదాపు 2లక్షల 72 వేల మంది వినియోగదారులకు నా కన్నపిల్ల వంటి ఉద్యోగుల ద్వారా ఉత్తమోత్తమ సేవలను అందిస్తున్నాను. 

సిరిసిల్ల జిల్లాకు వెలుగులు నింపిన ‘సెస్​’ను నేను

అది ఎలా అంటే నాడు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుండి 4,720 అన్ని కేటగిరీల సర్వీసులను కలుపుకొని నాకు అత్యంత మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో ప్రాణ ప్రతిష్ట చేశారు . నాడు సిరిసిల్ల ప్రాంతంలో 46 గ్రామాలకు మాత్రమే విద్యుత్తు సరఫరా ఉండేది. క్రమక్రమంగా ఈరోజు వరకు 2,72,000 వివిధ కేటగిరీల మొత్తం సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాలకు సంపూర్ణ విద్యుత్తును అందించిన సంస్థ గా పేరుగాంచినది. ఈరోజు సిరిసిల్ల ప్రాంతంల సంపూర్ణమైన వరి మెట్ట పంటలతో తులతూగుతున్నది. సెస్ పరోక్షంగా ఈ జిల్లా ప్రజలకు ఉపాధిని అందిస్తున్నది. ఎన్పీడీసీఎల్ లో పదిమంది పనిచేసే ఉద్యోగులకు సమానంగా సంస్థలో ఏడు మంది పనిచేస్తున్నారనే విషయాన్ని పాలకులు గమనించాలి. సిరిసిల్ల పట్టణం పద్మశాలీలకు నిలయం. అంతేగాక తెలంగాణ ప్రాంతంలో సిరిసిల్లను మరో  షోలాపూర్ గా  అభివర్ణిస్తారు. ఇక్కడ నేత పరిశ్రమలో వివిధ భాగాలతో కలుపుకొని పనిచేసే కార్మికులు 25 వేల మంది ఉంటారు. వీరికి చేతినిండా పని దొరుకుతుంది. కుటీర పరిశ్రమగా నేత పవర్లూమ్ కార్ఖానాలను గుర్తించి ప్రభుత్వ ఆదేశాల మేరకు50శాతం సబ్సిడీకి విద్యుత్తును సంస్థ సరఫరా చేయడం జరుగుతుంది. అంతేగాక 70 శాతం కలిగిన వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి సెస్ ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నది.  తద్వారా కర్షక, నేత కార్మిక కుటుంబాలు కంటి నిండా నిద్రకు, కడుపునిండా తిండికి కొదువ లేకుండా బతుకును గడుపుతున్నాయి. వేడినీళ్లకు చన్నీళ్లు తోడుగా కార్మిక కుటుంబాల మహిళలు బీడీలు చేస్తున్నారు. 

నా (సెస్​) వయస్సు 53 ఏండ్లు

సంస్థ 52 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇటీవల 53 వ సంవత్సరంలో అడుగు పెట్టింది. ఇందులో విద్యుత్ లైన్ల నిర్మాణ పనుల్లో వినియోగదారులు పాలుపంచుకునే సహకారం ఎన్నదగినది. వినియోగదారుల స్వచ్ఛంద శ్రమదానానికి విలువ కట్టి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగినది. నిజంగా తల్లి వంటి సంస్థ పరిధిలో నా పిల్లలు వినియోగదారులు ఎదిగి ఒదిగి ఉండడం ఎలాగో వాళ్లతో పాటు నాకు కూడా నేర్పించారు. అప్పుడప్పుడు 52 సంవత్సరాల నా ప్రగతిని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కొక్కసారి కించిత్తు గర్వంగా అనిపిస్తుంది. అప్పుడు ప్రారంభంలో4,175 సర్వీసులు ఉంటే ఇప్పుడు 2లక్షల 72,000 సర్వీసులు అన్ని కేటగిరీలు కలుపుకొని ఉండడం అనేక రేట్ల వినియోగదారుల చిత్తశుద్ధికి, బుద్ధికి, వృద్ధికి ఉత్పత్తికి తార్కాణము గా నిలవడం గొప్ప విశేషం కూడా. 

అవినీతి చీడ పట్టింది

అయితే నా సంరక్షణ కోసం ఒక పాలకవర్గాన్ని కూడా నేనే ఎన్నిక చేసుకొని ఏర్పాటు చేసుకున్నాను. అయితే మొదటి అయిదారు పాలకవర్గాల కాలంలో నేను ఎంతో అభివృద్ధి చెందాను. ఎందుకంటే ఆ పాలకవర్గం సభ్యులు నిజాయితీగలవారు కావడంతో పాటు సంస్థ విద్యుత్ సేవలను నిజాయితీగా అందించే నిబద్ధతతో పని చేశారు. అందుకని సంస్థ వందల రెట్లుగా ఎదిగింది  కానీ, ఇటీవల ఏర్పడిన రెండు పాలకవర్గాల కాలంలో నాకు అవినీతి చీడ పట్టింది.  నిధుల దుర్వినియోగం పీడ వచ్చి చేరింది. దీనితో నేను ఆర్థిక పౌష్టికాహార  లేమితో బాధపడుతున్నాను. సమతుల్య నిధుల ఆహారం కోసం వెంపర్లాడుతున్నాను. తల్లడిల్లుతున్నాను. ఇది ఈ ప్రాంతంలోని శాసనసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక మంత్రికి తెలిసినప్పటికీ నా బాధను, వేదనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.  పైగా ఇప్పుడు నన్ను ఉద్ధరించడానికి కొంతమంది పిడుచకట్టుకుపోతున్న నా గొంతుకు కాసిన నీటి బిందువులు అందించడానికి మళ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలి. కానీ అంతర్గతంగా అన్ని రాజకీయ వర్గాల జోక్యంతో బాధాకరంగా కార్యవర్గ సభ్యులఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందులో నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు.  కానీ నాకు అవినీతి చీడను తగిలించిన వారిని తిరిగి నిలబెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లుతుంది. పైగా నేను బాధపడుతున్నాను అంటే ఎన్పీడీసీఎల్ వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని ఒక ముఖ్య నాయకుడు మౌనంగా మనసులో పెట్టుకొని చేస్తున్నాడు. అటువైపు అడుగులు వేస్తున్నాడు. అని ఆ నోటా ఈ నోటా నా వరకు వచ్చింది. ఆయనకు తెలువది కావచ్చు, సమస్త మానవాళి సమాజం అంతా కూడా పరస్పర సహకారంతో నడుస్తున్నది ఈ విషయాన్ని గుర్తించాలి . 

మంత్రివర్యా.. నేను తల్లిలాంటి ‘సెస్​’ ను 

నువ్వు ఎక్కడ  పుట్టినవో, ఏడ చదువుకున్నవో, ఏడ పని చేసినవో నేను అడగలేదు. నాకు అవసరం లేదు. కోరి వచ్చినప్పుడు ఆదరించి కడుపులో పెట్టుకొని సాది సంరక్షించి నిన్ను అందరి పిల్లల్లా చూడక పెంచి నాయకుడిగా పెద్ద చేశాను. కానీ నువ్వు అన్ని మర్చిపోయినవ్. కన్నతల్లికి గంజిపోయనోడు, పిన్నతల్లికి బంగారు గాజులు చేయించినట్టు తాతకు దగ్గులు నేర్పినట్టు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు.  దయచేసి నన్ను ఇంకో 100 సంవత్సరాలు బతికేలా దీవించు తండ్రీ, బతకనివ్వు అయ్యా! బతుకును ఇవ్వు నాయనా! నా మొర ఆలకించు జరా నీకు ఎంత ఎన్ని గొప్ప పనులు ఉన్నా రాజకీయ బిక్ష పెట్టిన ఈ తల్లిని ఆదరించు కె.టి. రామారావూ బాపూ!  పడుసు పెడుసు కాదు. మీ నాయనకు నా గురించి అంతా ఎరికే, తెలిసినదే ఆయనకు. ఈ మతలబు చెవిన  వేయి. నేను తల్లి లాంటి సెస్ ను మాట్లాడుతున్నాను. తండ్రులారా ఆలోచించండి. మంత్రివర్యా  నేను సెస్ ను మాట్లాడుతున్నాను. నన్ను మిస్ కాకూడదు నువ్వు. కాసేపు నీ చల్లని చూపుల 'క్యాల్ 'ఇటువైపు పెట్టు దయగల్ల బిడ్డా !!! - జూకంటి జగన్నాథం, కవి, రచయిత