ముషీరాబాద్/ఖైరతాబాద్ వెలుగు: మహాత్మా జ్యోతిబా ఫూలేకు భారతరత్న ఇవ్వాలని, సెక్రటేరియట్ సమీపంలో ఆయన100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. బీసీ రాజ్యాధికార సమితి ఆఫీసులో గురువారం ఆయన మాట్లాడారు. ఫూలే దేశానికి ఆదర్శప్రాయుడన్నారు. బీసీలు ఒక్కటవుతున్నారన్న భయంతో జాతీయస్థాయిలో బీసీల గణనకు కేంద్రం వెనుకాడుతోందన్నారు. అలాగే అంబర్‌పేట ఆలీ కేఫ్ చౌరస్తాలో ఫూలే వర్ధంతిని నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.
దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త ఫూలే అని కొనియాడారు. అంటరానితనం, కుల నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. మాజీ ఎంపీ హనుమంతరావు, ఏఐసీసీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, అంబర్ పేట నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రోహిన్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ రావు, బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వెనుకుబడిన కులాల సమాఖ్య(బీసీఎఫ్) ఆవిర్భావ సభ గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది.
ఈ సందర్భంగా ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఫూలే ఆశయాలకు అనుగుణంగా సంస్థ పనిచేస్తుందని అధ్యక్షుడు చెన్న రాములు ప్రకటించారు. సినీ నిర్మాత జైహింద్ గౌడ్, సంస్థ ప్రధాన కార్యదర్శి మహతి రమేశ్నాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్టల భూమేశ్ముదిరాజ్, ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్రావు పాల్గొన్నారు. ఫూలే బహుజనుల వజ్రాయుధమని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి అంబర్‌పేటలోని ఫూలే విగ్రహానికి నివాళులర్పించారు.