- స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు గొప్ప విషయం
- గిరిజనుల భూసమస్యల పరిష్కారానికి హైడ్రా తరహా వ్యవస్థ తేవాలని సర్కార్ కు సూచన
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ ఆలోచన బాగుందని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కొనియాడారు. గిరిజనుల భూసమస్యల పరిష్కారానికి హైడ్రా తరహాలోనే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కోనేరు రంగారావు రిపోర్టును అమలు చేయాలని, ఆదివాసీల భూములు వారికి చెందే విధంగా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రూ.వేల కోట్ల విలువైన సంపద ఉందని, దాన్ని వెలికితీసి వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
తన ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విద్యాసాగర్‌రావు మాట్లాడారు. ‘‘సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా మంచిదే. మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు మేలు జరుగుతుంది. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనిర్సిటీ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. మన దేశంలో ఇంకా ఐదో వంతు పేదరికం ఉంది. దానికి స్కిల్ పరిష్కారం చూపుతుంది. దేశ యువతలోని శ్రమ శక్తిని బయటకు తీయడమే ఇప్పటి నాయకులకు అసలైన సవాల్. వారిని ప్రోత్సహించకపోతే గంజాయి, డ్రగ్స్ వంటి దురలవాట్లకు బానిసవుతారు” అని విద్యాసాగర్ రావు అన్నారు.
పాలకపక్షం, ప్రతిపక్షం కలిసుండాలె..
నాయకులు ఎవరు ఏ పార్టీలో ఉన్నా, జాతీయ భావన ఉంటుందని విద్యాసాగర్ రావు అన్నారు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, భారతీయతను వదులుకోకూడదని అంబేద్కర్ బౌద్ధమతంలో చేరారని చెప్పారు. పాలకపక్షం, ప్రతిపక్షం కొన్నిసార్లు ఒక్కటిగా ఉండాలన్నారు. ‘‘శ్రీపాదరావు దంపతులు నాకు అత్యంత సన్నిహితులు. అప్పట్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అందుకే ఆ ప్రాజెక్టుకు శ్రీపాదరావు పేరు పెట్టాలని బీజేపీ తీర్మానం చేసింది.
ఎప్పటికైనా ప్రధాని అవుతావని వాజ్ పేయ్‌ని నెహ్రూ అన్నారు. వాజ్ పేయ్‌ని పీవీ నరసింహారావు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు పంపారు. రథయాత్ర సమయంలో అశ్వమేధ యాగం చేస్తున్నారని అద్వానీని సీనియర్ ఎన్టీఆర్ మెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తన సినిమాల్లో బీసీ వాదాన్ని చక్కగా తెరకెక్కించారు. ట్యాంక్ బండ్‌పై పెట్టిన బుద్ధుడి విగ్రహం ఆయన ఆలోచన విధానానికి నిదర్శనం. మర్రి చెన్నారెడ్డి డైనమిక్ లీడర్. నేను మర్రి చెన్నారెడ్డిని పని అడిగితే వెంటనే చేసేవారు” అని గుర్తు చేసుకున్నారు.
పార్టీలకతీతంగా వచ్చారు...
తాను రచయితను కాదని, తనకు రచనలు రావు అని విద్యాసాగర్ రావు అన్నారు. ‘‘నేను గవర్నర్‌గా ఉన్నప్పుడు ఉనికి పుస్తకం రాశాను. ఇప్పుడు నా అనుభవాలతో ‘ఉనిక’ పేరుతో ఇంకో పుస్తకం రాశాను. ఆర్ఎస్ఎస్ నుంచి గవర్నర్ వరకు నా అనుభవాలతో ఈ పుస్తకం ఉంటుంది” అని పేర్కొన్నారు. ‘‘ఈ వేదికపై త్రివర్ణ పతాకం మాదిరి మూడు రంగులు కనపడుతున్నాయి. పార్టీలకతీతంగా నేతలందరూ పాల్గొన్నారు. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది మంచి పరిణామం: దత్తాత్రేయ
విద్యాసాగర్ రావు పుస్తకావిష్కరణకు ఎలాంటి అమరికలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి రావడం మంచి పరిణామమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ‘‘విద్యాసాగర్ రావు కుటుంబంలో ఎక్కువమంది వామపక్ష భావాలతో ఉన్నవారే. పేదలు, దళితుల కోసం విద్యాసాగర్ రావు కమిట్మెంట్‌తో పని చేశారు. నేను సంఘటనా మంత్రిగా కరీంనగర్ వెళ్తే విద్యాసాగర్ రావు కారులో తీసుకువెళ్లారు. విద్యాసాగర్ రావుకు, నాకు ఎప్పుడూ భేదాభిప్రాయాలు రాలేదు.
గోదావరి జలాలు తెలంగాణకు రావాలని విద్యాసాగర్ రావు పరితపించారు. జల్, జంగల్, జమీన్ అనే కార్యక్రమాన్ని విద్యాసాగర్ రావు చేపట్టారు” అని తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సామాన్య కార్యకర్త అని, ఆయన ఆవేశపరుడే కానీ చాలా తెలివైనవారని అన్నారు.
విద్యాసాగర్‌రావు స్ఫూర్తి ఒడిశాలో కొనసాగిస్తున్నం: కంభంపాటి
విద్యాసాగర్‌రావు గవర్నర్ గా పని చేసినప్పుడు ప్రజలు వచ్చేలా రాజ్ భవన్ గేట్లు తెరిచే ఉంచారని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. ఇప్పుడదే స్ఫూర్తి ఒడిశాలో కొనసాగిస్తున్నామని చెప్పారు. గిరిజన పరిరక్షణ చట్టాలు, షెడ్యూల్ 5లో రాజ్యాంగం కల్పించిన హక్కులపై ఉనిక పుస్తకంలో ప్రస్తావించారని.. అవి గవర్నర్ గా తనకెంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ‘‘వేదిక మీద ఉన్నవారంతా ఏదో ఒక సమయంలో ఎంపీలే.
మంత్రి శ్రీధర్‌బాబు మినహా మిగతా వారంతా ఎంపీలుగా చేశారు. శ్రీధర్ బాబు కూడా ఎప్పుడో ఒకప్పుడు పార్లమెంట్‌కు వెళ్తే బాగుంటుంది” అని హరిబాబు అన్నారు. దీంతో ‘పార్లమెంట్‌కి పోటీ చేస్తావా?’ అంటూ శ్రీధర్‌బాబును సీఎం రేవంత్, బండి సంజయ్ నవ్వుతూ అడిగారు.
ఇప్పుడంతా వ్యక్తిగత రాజకీయాలు నడుస్తున్నయ్: శ్రీధర్ బాబు
ఇప్పుడంతా వ్యక్తిగత రాజకీయాలు నడుస్తున్నా యని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సిద్ధాంతాలు వేరైనా, తాము వ్యక్తిగత రాజకీయాలు చెయ్యమని చెప్పారు. ‘‘కరీంనగర్ జిల్లా నుంచి పీవీ ప్రధానిగా పని చేశారు. విద్యాసాగర్ రావు కేంద్రమంత్రిగా కరీం నగర్ జిల్లాకు పేరు తీసుకొచ్చారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం విద్యాసాగర్ రావు పాద యాత్ర చేశారు.
నేను అడగ్గానే రాంగిరి ఖిల్లాకు రూ.10 లక్షలు ఇచ్చారు. మా నాన్న శ్రీపాద రావుకు విద్యాసాగర్ రావు అత్యంత సన్నిహి తులు. తెలంగాణవాదిగా ఉద్యమంలో విద్యాసాగర్ రావు తనవంతు పాత్ర పోషిం చారు. తెలంగాణ ఒకరిద్దరితో రాలేదు. విద్యాసాగర్ రావు లాంటి చాలా మంది నేతలు కృషి చేస్తేనే వచ్చింది” అని చెప్పారు.
తెలంగాణ విమోచనం అంటే విద్యాసాగర్ రావు గుర్తొస్తరు: బండి సంజయ్
తెలంగాణ విమోచన (సెప్టెంబర్ 17) దినం అంటే సీహెచ్ విద్యాసాగర్ రావు గుర్తుకువస్తారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ‘‘బీజేపీలో తెలంగాణ నినాదాన్ని, వాదాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు.
తెలంగాణకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో తెలుసా? అంటూ స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమ తీవ్రత మొదలు కాకముందే విద్యాసాగర్ రావు ఫ్లెక్సీలు కట్టడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలనే ఉద్యమానికి కర్త, కర్మ ఆయనే” అని చెప్పారు.