ఈ రోజుల్లో యూట్యూబ్ గురించి తెలియనివాళ్లు ఉండరు. సినిమాలు, పాటలు, వంటలు, ఆటలు, వార్తలు.. ఇలా ఒకటేంటి ‘ఆల్ ఇన్ వన్’ వీడియో ప్లాట్‌ఫామ్‌గా యూట్యూబ్ డైలీలైఫ్‌లో భాగమైపోయింది. యూట్యూబ్‌లో ఫస్ట్ అప్‌లోడ్ అయిన వీడియో ఏంటో తెలుసా? చాద్ హర్లే, స్టీవ్ చెన్, జావేద్ కరీమ్ అనే ముగ్గురు పేపాల్ సంస్థ ఉద్యోగులు 2005లో ‘యూట్యూబ్’ అనే వీడియో ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు. ‘వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తే ఎవరైనా చూస్తారా?’ అన్న డౌట్ ఉండేది వాళ్లకు. ఏదేమైతేనేం ఒక ట్రయల్ వేద్దాం అనుకున్నారు.
కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో జూకు వెళ్లి అక్కడ ఓ వీడియో తీశారు. యూట్యూబ్ ఫౌండర్స్‌లో ఒకరైన జావేద్ కరీమ్.. ఏనుగుల ముందు నిల్చొని వాటి గురించి తడబడుతూ మాట్లాడాడు. ఆ వీడియో టైటిల్ ‘మీ ఎట్ ద జూ’. ఇదే యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఫస్ట్ వీడియో. ఏప్రిల్ 23, 2005 న అప్‌లోడ్ అయిన ఈ వీడియో చాలా పాపులర్ అయింది. దాంతో యూట్యూబ్‌లో మామూలు వీడియోలు కూడా అప్‌లోడ్ చేయొచ్చని యూజర్లకు తెలిసింది. కొన్ని రోజుల్లోనే ఆ వీడియోకి లక్షల వ్యూస్ వచ్చాయి. వాళ్లు తీసిన చిన్న వీడియోను ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఒకేసారి చూస్తున్నారన్న విషయం తెలిసి ఆ టీమ్ ఆశ్చర్యపోయారు.ఆ తర్వాత యూట్యూబ్‌లో చాలామంది సొంతంగా వీడియోలు తీసి అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టారు. యూట్యూబ్‌ను మరింత డెవలప్ చేయడానికి ఆ వీడియోకి వచ్చిన రెస్పాన్సే కారణం. ‘మీ ఏట్ ద జూ’ వీడియోకి ఇప్పటివరకూ 25 కోట్ల వ్యూస్ వచ్చాయి.