భూపాల్ రెడ్డిని మార్చకుంటే ఓడిస్తాం: చాడ కిషన్ రెడ్డి

నల్గొండ అర్బన్​, వెలుగు: నల్గొండ నియోజవర్గంలో భూపాల్ రెడ్డిని అభ్యర్థిత్వంపై సీఎం కేసీఆర్‌‌ పునరాలోచన చేయాలని, లేదంటే ఓడిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా రామగిరిలోని గాంధీ విగ్రహానికి నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారు.  23 ఏళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నేతలను కంచర్ల పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఉద్యమ నాయకుడు కానప్పటికీ హైకమాండ్ సూచన మేరకు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించామని చెప్పారు. 

కానీ,  నాలుగున్నరేళ్లులో ఏనాడు  ఉద్యమకారులను, సీనియర్లను గౌరవించలేదని మండిపడ్డారు.  పైగా పార్టీ కోసం కష్టపడే నాయకులపై కక్ష సాధింపు చర్యలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు.  కేటీఆర్​ పర్యటకు సైతం తనకు ఆహ్వానం పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సంక్షేమ పథకాలు కూడా ఉద్యమకారులకు, వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదన్నారు.  బీఆర్‌‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తనకు సంబంధించిన వాల్ రైటింగ్స్‌, పోస్టర్లను కూడా తన అనుచరులు, మున్సిపల్ సిబ్బందితో తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆయన తీరుతో ఇప్పటికే ఎంతోమంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారని, ఆయన టికెట్‌పై పునరాలోచన చేయకపోతే పార్టీకి ఓటమి తప్పదని హెచ్చరించారు.  అందరినీ కలుపుకుపోయే ఏ నాయకునికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామని స్పష్టం చేశారు.