పెద్దపల్లిలో వంశీకృష్ణను గెలిపించండి : చాడ వెంకట్ రెడ్డి

  • సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి పిలుపు

మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. వంశీ గెలుపును కార్యకర్తల తమ గెలుపుగా భావించాలని పనిచేయాలని కోరారు. ఆదివారం మంచిర్యాలలోని స్వాగత్ ప్రైడ్ కాన్ఫరెన్స్ హాల్‌‌‌‌లో నిర్వహించిన మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల సీపీఐ ముఖ్య కార్యకర్తల మీటింగ్‌‌‌‌కు చాడ వెంకట్‌‌‌‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

పార్లమెంట్​ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెప్పారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. బీజేపీ పదేండ్ల పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదని, దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసిందని విమర్శించారు. సంఘ్ పరివార్​శక్తుల ఎజెండాలో బీజేపీ పరిపాలన సాగుతోందని ఆరోపించారు. 

బీజేపీకి 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, పౌరులకు ఎలాంటి హక్కులు ఉండవని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, టౌన్​సెక్రటరీ ఖలీందర్​ఖాన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​పాల్గొన్నారు.