
హనుమకొండ/కాశీబుగ్గ, వెలుగు: మార్క్సిజం, లెనినిజాన్ని మించిన సిద్ధాంతం లేదని, అదే సిద్ధాంతంతో దేశంలో అధికారంలోకి వస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సీపీఐ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి చౌరస్తా వరకు, హనుమకొండ జిల్లాలో వేయి స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ రెడ్ షర్ట్స్ ధరించి ర్యాలీలో పాల్గొనగా.. ఉమ్మడి జిల్లా కేంద్రమంతా ఎరుపుమయ మైంది. ర్యాలీలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావుతో కలిసి చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ దేశంలో రాజరిక వ్యవస్థను అంతం చేసి ప్రజాస్వామ్య పాలన రావడానికి సీపీఐ ఎనలేని పోరాటం చేసిందన్నారు. అప్పటికే కాంగ్రెస్ ఉన్నా.. సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం సీపీఐ పోరాడిందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. అయితే ప్రజాస్వామ్య ముసుగులో మతోన్మాదం, ఫాసిజం, నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.