భీమదేవరపల్లి, వెలుగు : ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలు అంటున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే హక్కుల గురించి సర్కారియా కమిషన్ ఇచ్చిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం మర్చిపోవద్దన్నారు.
రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జమిలీ ఎన్నిక విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువుల్లో ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని, కానీ నిరుపేదలపై ప్రతాపం చూపకుండా వారికి ప్రత్యామ్నాయం చూపాలన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో ప్రారంభమైన దేవాదుల ప్రాజెక్ట్‌కు మోక్షం కలగడం లేదని, పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఎల్కతుర్తి–-సిద్దిపేట జాతీయ రహదారి నిర్మాణంలో క్వాలిటీ లేదని, ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డికి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఈ నెల 26న భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల లీడర్లతో గోపాల్‌పూర్ క్రాస్‌రోడ్డు వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహిస్తామని చెప్పారు. కులగణనను పూర్తి చేసి, ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తక్కళ్లపెల్లి శ్రీనివాస్‌రావు, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, నాయకులు కొంగల రాంచంద్రారెడ్డి, తోట భిక్షపతి, ఆదరి శ్రీనివాస్, లక్ష్మణ్, సంతోష్ పాల్గొన్నారు.