ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కోరుట్ల, వెలుగు:  ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని ప్రభాకర్​ భవన్​లో  సీపీఐ జనరల్ బాడీ మీటింగ్​కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల, బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ దేశవ్యాప్త ఉద్యమాలు చేస్తుందని చెప్పారు. అందులో భాగంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టి వినతి పత్రాలు ఇస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నాయని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి  సురేశ్, విశ్వనాథం, రాములు, రాధ, మణికంఠ, హన్మంతు, దశరథం పాల్గొన్నారు.

కేటీఆర్​ ఉద్యమంలో ఎక్కడున్నవ్​? బీజేపీ నేత యెండల లక్ష్మీ నారాయణ

వేములవాడ, వెలుగు : ‘ కేటీఆర్​నీవు సిరిసిల్లకు రావాలంటే పోలీస్ పహారా లేనిదే రాలేవు.. పోలేవు.. అలాంటిది.. నిత్యం ప్రజల మధ్య ఉండే బీజేపీ చీఫ్​బండి సంజయ్​పై విమర్శలు చేస్తున్నవా? అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ  నిలదీశారు. వేములవాడలోని భీమేశ్వర గార్డెన్స్​లో బుధవారం ఆయన ప్రెస్​మీట్​లో మాట్లాడారు. కేటీఆర్​తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారో చెప్పాలని సవాల్​విసిరారు. మొదటి నుంచి ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కకు జరిపి పారాచూట్​లో సిరిసిల్లలో వాలిన నీవు.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేటీఆర్​తరచూ చెప్పే రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరాపై చర్చకు సిద్ధమా? అని సవాల్​విసిరారు. గతంలో ‘సెస్’ లో అవినీతి చేసిన చిక్కాల రామారావుకు మళ్లీ టికెట్​ఇవ్వడం దుర్మార్గమన్నారు.-- అభివృద్ధి అంటే రోడ్లు, లైట్లే  అనుకుంటున్నావా? అని ప్రశ్నించారు.  వచ్చే ఎన్నికల్లో  సిరిసిల్లలో రైతులు, నేతన్నలే  కేటీఆర్ ను తొక్కేస్తారని హెచ్చరించారు. బండి సంజయ్​పై చేసిన విమర్శలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.  బీజేపీ నిజమాబాద్ జిల్లా  ఇన్​చార్జి మీసాల చంద్రయ్య, దళిత మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్, జిల్లా కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు పాల్గొన్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

మానకొండూర్,(తిమ్మాపూర్) వెలుగు:  వరంగల్– కరీంనగర్ నేషనల్​ హైవే పై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా హనుమకొండ కు చెందిన ముదిగంటి వంశీధర్ రెడ్డి (35) బిజినెస్​పనిమీద మంగళవారం రాత్రి 8 గంటలకు కరీంనగర్ కు తన బొలేరో వెహికల్​లో స్వయంగా డ్రైవింగ్​చేసుకుంటూ వెళ్లాడు. కరీంనగర్ లో పని ముగించుకొని తెల్లవారుజామున హన్మకొండకు వెళ్తుండగా మార్గ మధ్యలో సదాశివపల్లి స్టేజీ వద్ద ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టి, తిరిగి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలపై స్పాట్​లోనే చనిపోయాడు. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో వారు కుటుంబ సభ్యులకు తెలిపారు.  భార్య ముదిగంటి మౌనిక కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్​ తెలిపారు.  

విద్యను అంగట్లో సరుకులా మార్చిన్రు..    జాజుల శ్రీనివాస్​గౌడ్​

జగిత్యాల, వెలుగు: తెలంగాణలో  ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్​ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని విస్మరించి విద్య, వైద్యం అంగట్లో సరుకులుగా మార్చారని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ యువజన సంఘాల ఆధ్వర్యంలో పాలమూరు  నుంచి పట్నం వరకు చేపట్టిన పోరు యాత్ర జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా కొత్త బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు ఫీజు  రీయింబర్స్​మెంట్​సకాలంలో విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.  గ్రామానికో స్కూల్​ఏర్పాటు చేయడం మరిచి గల్లీకో బెల్ట్ షాప్ తెరిచేలా పర్మిషన్లు ఇస్తున్నారని ఎద్దేవా  చేశారు.  బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలకతీతంగా బీసీలంతా ఏకమై సామాజిక న్యాయం కోసం పోరాడాలని 
పిలుపునిచ్చారు.   

ఘనంగా సెమీ క్రిస్మస్​ వేడుకలు

కోనరావుపేట/సిరిసిల్ల టౌన్/ గోదావరిఖని, వెలుగు: సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో బుధవారం సెమీ క్రిస్మస్​వేడుకలు ఘనంగా నిర్వహించారు.  కోనారావుపేట మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన వేడుకకు జడ్పీ చైర్​పర్సన్​ న్యాలకొండ అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మతాలకతీతంగా అన్ని పండుగలను జరుపుతున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ  అన్నారు. క్రిస్టియన్లకు ప్రభుత్వం అందించిన దుస్తులను, కానుకలను పంపిణీ చేశారు. , సిరిసిల్ల బీవై చర్చిలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ హాజరై కానుకలను పంపిణీ చేశారు. గోదావరిఖని సెక్రెడ్ ​హైస్కూల్​లో  వేడుకల్లో భాగంగా స్టూడెంట్లు ప్రదర్శించిన నాటిక, నృత్యాలు ఆకట్టుకున్నాయి. 

పవర్​ఫుల్ ​కంట్రీగా తీర్చి దిద్దాలి

తిమ్మాపూర్, వెలుగు: స్టూడెంట్లు పరిశోధనలపై ఫోకస్​పెట్టి కొత్త టెక్నాలజీని డెవలప్ ​చేసి దేశాన్ని పవర్ ​ఫుల్​కంట్రీగా తీర్చిదిద్దాలని ట్రిఫుల్​ఐటీ  డైరెక్టర్ ప్రొఫెసర్ డా. సతీశ్​కుమార్ సూచించారు.  మండలంలోని ఎల్ఎండీ కాలనీలో  ‘శ్రీ చైతన్య ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ ’ ట్రిఫుల్​ఈ విభాగం ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘తేజస్సు–2022’  టెక్నికల్ ఫెస్ట్ ను హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నికల్​ఎడ్యుకేషన్​ స్టూడెంట్లు టెక్నాలజీపై పట్టు సాధించాలని, కొత్త ఆవిష్కరణలు చేయాలన్నారు.    కాలేజీ చైర్మన్ ముద్దసాని రమేశ్​రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. 

24 గంటలు కరెంట్​ ఇస్తున్నాం

గంభీరావుపేట, వెలుగు: గత ప్రభుత్వాల హయాంలో కరెంటు లేక ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని,  బీఆర్ఎస్​ప్రభుత్వంలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. బుధవారం గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గౌరినేని నారాయణ రావు కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీగాధ గ్రామస్తులు  నారాయణరావుకు ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. రవీందర్​రావు మాట్లాడుతూ జిల్లాలో మంత్రి కేటీఆర్​చేసిన అభివృద్ధిని చూసి ,సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్​మద్దతిస్తున్న అభ్యర్థులను గెలిపించాలని  కోరారు. సర్పంచ్ బాబు,  హన్మాండ్లు, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.


‘డబుల్’​ ఇండ్లను వెంటనే పంచాలి

నెట్​వర్క్​, వెలుగు: అర్హులైన పేదలందరికీ వెంటనే డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్​చేశారు. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ల ఆఫీసుల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..  ప్రభుత్వం ప్రకటించిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం దుర్మార్గమన్నారు.  దళితులందరికీ ‘దళిత బంధు’ మాటలకే పరిమితమైందని విమర్శించారు. వెంటనే  పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. అనంతరం తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. 

బీజేపీ మద్దతిచ్చే అభ్యర్థులను గెలిపించండి

ఎల్లారెడ్డిపేట, వెలుగు: సెస్ ఎన్నికల్లో బీజేపీ మద్దతిస్తున్న అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ స్టేట్​లీడర్, మాజీ ఎమ్మెల్యే  కూన శ్రీశైలం గౌడ్ కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి గుండాటి వెంకట్ రెడ్డి  తరఫున శ్రీశైలం గౌడ్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ 15 ఏండ్లుగా సెస్ ని బీఆర్ఎస్  దివాళా తీయిస్తోందని,  బీజేపీ మద్దతిస్తున్న అభ్యర్థులను గెలిపించి బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్​ లీడర్లు వారికి నచ్చిన కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. సెస్ ఎన్నికల్లో వెంకట్ రెడ్డి ని గెలిపిస్తే సెస్ ఆఫీస్​, ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.   

రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తరు?

చొప్పదండి, వెలుగు: బీఆర్ఎస్​ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన రైతు రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చొప్పదండి తహసీల్దార్​అంబటి రజితకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా  తేల్చారని  వీరిలో ఎవరెవరికి రుణమాఫీ చేశారో వైట్​పేపర్​రిలీజ్​చేయాలని డిమాండ్ చేశారు.  

‘సెస్’ ఎన్నికల ప్రచార జోరు..

సెస్​ ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులే గడువు ఉండడంతో బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగింది. పార్టీల మద్దతుతో రంగంలో ఉన్న అభ్యర్థులతో పాటు,  ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీల ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొని ఓట్లడిగారు.     ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి  కూరపాటి శ్రీధర్ మాట్లాడుతూ తాను మంత్రి కేటీఆర్​ను కలవడంతో పోటీ నుంచి విరమించుకున్నానని ప్రచారం చేస్తున్నారని, అది సరికాదన్నారు. - నెట్​వర్క్​, వెలుగు