భీమదేవరపల్లి,వెలుగు: చట్టసభల్లో తక్షణమే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించేలా కేంద్రం చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో దివంగత ప్రధాని పీవీ నరసింహరావు ఇంటి వద్ద నవసంఘర్షణ సమితి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరవధిక దీక్ష చేపట్టారు. ముఖ్య అతిథిగా చాడ హాజరై మాట్లాడుతూ .. బీసీల జీవితాల్లో మార్పు తీసుకువస్తామని, 2014లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ పదేండ్లు గడిచిన పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రస్తావన లేదన్నారు.
రాబోయే ఎన్నికలకు ముందే చట్టసభల్లో బిల్లు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ తరుపున ఊసకొయిల ప్రకాశ్ సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో నవసంఘర్షణ సమితి జాతీయ చైర్మెన్ పంజాల జైహింద్ గౌడ్, ఎన్ఎస్ఎస్ జాతీయ కోఆర్డినేటర్ పెండ్యాల మధు,సర్వాయి పాపాన్న సేన జాతీయ అధ్యక్షుడు పరిటాల రవి బాబు,నాయకులు డా.ఎదులాపురం తిరుపతి,మంచాల వెంకటస్వామి, పోగుల శ్రీకాంత్ పాల్గొన్నారు.