- బెల్లంపల్లిలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి
బెల్లంపల్లి, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి దేశ రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు పోరాటం చేస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ చేపట్టిన ప్రజా పోరుయాత్ర బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభతో ముగిసింది. సీపీఐ నియోజకవర్గ సెక్రటరీ రేగుంట చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు చాడ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో ఉన్న 70 లక్షల కోట్ల నల్ల డబ్బును బయటకు తీసి ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న ప్రధాని మోదీ ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల పోడు భూములు ఉన్నాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు పోడు భూములు 3 లక్షల ఎకరాలే అని మాట మార్చిందన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారని వీఏఓ లు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఓపీఓ లు సమ్మె చేస్తుంటే వారిని ప్రభుత్వం బెదిరించడం సరైంది కాదన్నారు. గుండా మల్లేష్ ఆశయాల సాధనకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి అసెంబ్లీ స్థానంలో సీపీఐ పోటీ చేయాలని భావిస్తున్నట్లు చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. బెల్లంపల్లి ప్రాంత ప్రజలు కార్మికుల కోసం పోరాడే పార్టీని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
ఈ సభలో ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, కుమ్రం భీం(ఆసిఫాబాద్), మంచిర్యాల జిల్లాల సీపీఐ పార్టీ సెక్రటరీలు బద్రి సత్యనారాయణ, రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్, మహిళా సమాఖ్య రాష్ట్ర సెక్రటరీ గుండా సరోజన, జిల్లా సెక్రటరీ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.