విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి : చాడ వెంకట్​రెడ్డి

విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి : చాడ వెంకట్​రెడ్డి
  •     సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్​రెడ్డి

భీమదేవరపల్లి, వెలుగు: విభజన హామీలు అమలుకు కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి అన్నారు.ఆదివారం సీపీఐ హనుమకొండ జిల్లా కౌన్సిల్​ సమావేశాలు భీమదేవరపల్లి మండలం ములుకనూర్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసిన అనంతరం చాడ మాట్లాడారు. 

మొన్నటి చాలా రాష్ర్టాల్లో బీజేపీ అవలంభించిన విధానాలను ప్రజలు వ్యతిరేకించారని, ఎంపీ ఎన్నికల్లో ఫలితాలే దానికి ఉదాహరణ అని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. గత పాలనలో రాజద్రోహం కేసులు పెట్టి, అనేక ఇబ్బందులకు గురిచేశారని అని అన్నారు. బలమైన ఇండియా కూటమి దాని భాగస్వామ్య పక్షాలు ప్రజా సంక్షేమం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ నెల 27న జరిగే సింగరేణి బొగ్గు వేలం ఆపి ఆ సంస్థకే టెండర్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. పార్టీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్ళపెల్లి శ్రీనివాస్​ మాట్లాడుతూ రాష్ర్టంలోనే మొదటి జిల్లా కౌన్సిల్​ నిర్మాణ సమావేశం హనుమకొండ జిల్లాదే అని తెలిపారు. 

పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్కర్తలు కృషి చేయాలని పలుపునిచ్చారు. గుడిసె వాసులకు ఇళ్ళ పట్టాలు అందించాలని ఈ నెల 19న మండల కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం ఉందన్నారు.ఆగస్టు 22,23,24న సీపీఐ రాష్ర్ట కౌన్సిల్​ నిర్మాణ సమావేశాలు హనుమకొండలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి,రైతు సంఘం రాష్ర్ట నాయకులు కొంగల రాంచంద్రారెడ్డి, ఏఐఎస్​ఎఫ్​ జిల్లా కార్యదర్శి సంతోష్​ యాదవ్, మండల కార్యదర్శులు శ్రీనివాస్, రాములు, రాష్ర్ట కమిటీ సభ్యులు విజయ సారధి, నేదునూరి జ్యోతి, భిక్షపతి పాల్గొన్నారు.