కరీంనగర్/హుస్నాబాద్, వెలుగు : సెప్టెంబర్17ను ఇంతకాలం రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకు వాడుకున్నాయని, రేవంత్‌రెడ్డి సర్కారైనా ఆ రోజును విలీన దినోత్సవంగా నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు వర్ధంతి సందర్భంగా కరీంనగర్ మార్కెట్ ఏరియాలో, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ గడ్డను విముక్తి చేసేందుకు అనభేరి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు, ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ విమోచన దినం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటికి ఆ పార్టీయే లేదన్నారు.
సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన చిట్యాల ఐలమ్మను కులం పేరుతో చాకలి ఐలమ్మ అని అనడం సరికాదని, ఆమెను కమ్యూనిస్ట్ ఐలమ్మ అని పిలవాలని పిలుపునిచ్చారు. తాను ఏడాది వయస్సు ఉన్నప్పుడే తన తండ్రిని రజాకార్లు కాల్చి చంపారని అనభేరి ప్రభాకర్‌రావు కుమార్తె విప్లవ కుమారి గుర్తు చేశారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూడా తీసేయాలని కొందరు కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.