ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్​ సిటీ, వెలుగు: భూముల సర్వే, ధరణి విషయంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కష్టాలు ఉన్నచోటే ఎర్ర జెండా ఎగరాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.  గురువారం నగరంలో సీపీఐ 22వ జిల్లా మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్​లో అనేక తప్పులున్నాయని అన్నారు. చిగురుమామిడి ప్రాంతాల్లో భూమి, సాగునీటి సమస్యలు అనేకం ఉన్నాయని వాటిపై పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎర్రజెండా అనేక పోరాటాలు చేసి విజయం సాధించిందని, పార్టీ పదవులు తీసుకుని పని చేయకపోతే ద్రోహం చేసినట్లేనన్నారు. బీజేపీ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోందని, తెలంగాణలో అధికారంలోకి వస్తే మొదటి దెబ్బ ఎర్రజెండాపైనే పడుతుందని వెంకట్​రెడ్డి అన్నారు. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మర్రి వెంకటస్వామి, టేకుమల్ల సమయ్య, సృజన్, మణికంఠ పాల్గొన్నారు. 

ఆరోపణలు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా

పెద్దపల్లి, వెలుగు: తనపై చేస్తున్న ఆరోపణలు  నిజమని నిరూపిస్తే మంథని అంబేద్కర్ చౌరస్తాలో ఆత్మహత్య చేసుకుంటానని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఛాలెంజ్ చేశారు. గురువారం మంథని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. తనపై మొదటి నుంచి స్థానిక ఎమ్మెల్యే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. మంథని మధుకర్ హత్య నుంచి ఇటీవల వెలుగులోకి వచ్చిన చికోటి ప్రవీణ్ అంశంలోనూ తనను దోషిని చేయాలని చూస్తున్నారన్నారు. గతంలో రూ.900 కోట్ల స్కాంలో నిందితుడిగా చూపాలని ప్రయత్నించారని అది కూడా ఫేక్ అని తేలిందన్నారు. ఇప్పటి వరకు వీటిలో ఏది నిజమని తేలినా అంబేద్కర్ చౌరస్తాలో ఆత్మహత్య చేసుకుంటానన్నారు. ఇప్పటికైన ప్రజలు, మీడియా నిజాలు గుర్తించాలని ఆయన 
కోరారు. 

మొక్కలు నాటుతూ ఆగిన గుండె

‌‌వేములవాడ, వెలుగు: హరితహారంలో భాగంగా స్థానిక మున్సిపల్ పరిధిలో మొక్కలు నాటేందుకు వచ్చిన దినసరి కూలీ తులవేణి లక్ష్మయ్య(51) గురువారం మొక్కనాటుతూ నేలకూలాడు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి సమీపంలోని గురువన్నపేటకు చెందిన లక్ష్మయ్య కొన్ని రోజులుగా వేములవాడలోని తిప్పాపూర్ లో నివాసం ఉంటున్నారు. దినసరి కూలీగా పని చేస్తున్న ఆయన చెక్కపల్లి రహదారిలో మొక్కలు నాటుతూ కుప్పకూలి చనిపోయాడని బంధువులు తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ను, చైర్ పర్సన్​ను వివరణ కోరగా తమకేం తెలియదని పేర్కొన్నారు.  టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ కేవలం మొక్కలు పెట్టించే వరకే తన బాధ్యత అని లేబర్ల గురించి 
తెలియదని పేర్కొన్నారు. 

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

కరీంనగర్ టౌన్, వెలుగు: నగరంలోని ఆర్విన్ ట్రీ స్కూల్ లో  చైర్మన్ రమణారావు ఆధ్వర్యంలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు. స్టూడెంట్లు శ్రీకృష్ణుడు, రాధ, గోపికలతో పాటు బలరాముల వేషధారణతో అలరించారు. 

సిద్దార్థ స్కూల్లో..

నగరంలోని సిద్ధార్థ స్కూల్ లో డైరెక్టర్ దాసరి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. పిల్లల్లో ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంపొందించడానికి ఇలాంటి పండుగలు దోహదపడతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, టీచర్స్,పేరెంట్స్,స్టూడెంట్స్ పాల్గొన్నారు. 

కొత్తపల్లిలో..

కొత్తపల్లి: పట్టణంలోని ప్యారడైజ్, సెయింట్ జార్జ్​, గంగాధర మండలం మధురానగర్ విన్నర్స్ ఎడ్జ్ స్కూల్, మంకమ్మతోట పారమిత స్కూల్​లో కృష్ణాష్టమి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా రకరకాల నైవేద్యాలను కృష్ణుడికి సమర్పించారు. అనంతరం ఉట్టి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాల్లో పాఠశాలల చైర్మన్లు ప్రసాదరావు, ఫాతిమారెడ్డి, టీచర్స్​పాల్గొన్నారు. 

అల్ఫోర్స్​ఈ టెక్నోలో.. 

కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్​లో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్​ వి.నరేందర్​రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. 

నాణ్యమైన వైద్యం కోసమే బస్తీ దవాఖానా

సిరిసిల్లటౌన్, వెలుగు: పట్టణంలోని రాజీవ్​నగర్​లో నిర్మించిన బస్తీ దవాఖానాను కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం దవాఖానాను ఏర్పటు చేస్తోందని, ఆర్థిక సంఘం నిధులు రూ.13 లక్షలతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న రేయిలింగ్ వర్క్ పూర్తి చేయాలన్నారు. అంతకుముందు కలెక్టర్​సుందరయ్య నగర్ లోని భవిత సెంటర్ రెన్నోవేషన్ పనులను డీఈఓ రాధా కిషన్ తో కలిసి పరిశీలించారు. కలెక్టర్​ వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, డీపీఆర్వో దశరథం ఉన్నారు.