
- పోరుకు సిద్ధమవుతున్న చాడ
- కాంగ్రెస్ తో కలిసే అవకాశం
సిద్దిపేట, వెలుగు: హుస్నాబాద్ సీపీఐ లో అంతర్మథనం మొదలైంది. నిన్న, మొన్నటి వరకు బీఆర్ఎస్ పొత్తుతో హుస్నాబాద్ లో పోటీలో నిలవాలని ఉవ్వుళ్లూరిన సీపీఐ ఇప్పుడు ఒంటరిగా.. కుదిరితే కాంగ్రెస్‌తో కలిసి పార్టీ బరిలో దిగే అవకాశం ఉంది. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డిని పోటీలో నిలిపేందుకు పార్టీ సన్నద్ధమవుతోంది.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యునిస్టులతో బీఆర్ఎస్ కు మంచి బంధం ఏర్పడటంతో సాధారణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చనే ఊహాగానాలు సాగాయి. ఈ నేపథ్యంలో సీపీఐ హుస్నాబాద్ సీటును కోరుకోవాలనే ఉద్దేశంతో ఉండగానే సీఎం కేసీఆర్అభ్యర్థిని ప్రకటించడంతో ఇప్పుడు పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే హుస్నాబాద్ నుంచి బరిలో ఉండేది తానేనని గత ఆరు నెలలుగా చాడ వెంకట్‌రెడ్డి కార్యకర్తలను సమాయత్తం చేస్తూ వస్తున్నారు. గత మేలో హుస్నాబాద్ లో భారీ సభను నిర్వహించి రాష్ట్ర, జాతీయ కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, నారాయణలను రప్పించి సీపీఐ బలాన్ని ప్రదర్శించారు.
హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ అవకతవకలు, సబ్ కోర్టు మంజూరు, గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలపై ఆందోళన చేయడంతో పాటు మండలాల వారీగా పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. అసెంబ్లీ లో ప్రశ్నించే గొంతులకు లేవనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ గడప గడపకు సీపీఐ అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహించారు. వీటితో పాటు ఆసరా పెన్షన్లు, పక్కా ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం, ధరణి సమస్యలు, భూముల సమగ్ర సర్వే లాంటి డిమాండ్లతో సీపీఐ ప్రజా మద్దతు కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
ఒక దశలో బెల్లంపల్లి, హుస్నాబాద్, భద్రాచలం సీట్లను సీపీఐ అడిగిందని, సీఎం కేసీఆర్ మాత్రం మునుగోడు సీట్ ను ఆఫర్ చేశారని ఒకసారి, అసెంబ్లీ సీటు ఇవ్వకుండా చాడకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కేసీఆర్ చెప్పారని మరోసారి ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థిగా వొడితెల సతీశ్‌కుమార్ ను ప్రకటించడంతో ఇప్పుడు సీపీఐ ఇతర మార్గాలను వెతుక్కుంటోంది.
బహుముఖ పోటీ!
ఈసారి హుస్నాబాద్ నియోజకవర్గంలో బహుముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్, బీజెపీ తోపాటు సీపీఐ, బీఆర్ఎస్ పోటీలో ఉండనున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరితే మాత్రం సీపీఐ ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుతో హుస్నాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా చాడ వెంకట్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయాడు.
ఈసారి కూడా పొత్తు కుదిరితే మళ్లీ ఆయనే బరిలో ఉంటారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తారా? లేక విడిగా పోటీ చేస్తారా? అనే అంశం పై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఒకవేళ కాంగ్రెస్ తోపాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదిరినా హుస్నాబాద్ ను మాత్రం సీపీఐకే కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పరిస్థితి లేకుంటే హుస్నాబాద్ లో సీపీఐ ఒంటరిగానైనా పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.