భీమదేవరపల్లి,వెలుగు: బీఆర్ఎస్తో పొత్తున్నా హుస్నాబాద్ సీటును సీపీఐ వదులుకోబోదని, పోటీలో తప్పక ఉంటామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 119 నియోజకవర్గాల్లో సీపీఐ కమిటీలు వేస్తోందన్నారు.
25 సీట్లలో పోటీ చేస్తామని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో కూడా పోటీలో ఉండే అవకాశాలున్నాయన్నారు. దీని కోసం విస్తృత స్థాయి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. బీఆర్ఎస్తో పొత్తున్నా ప్రజావ్యతిరేక పాలన చేస్తే పోరాటం తప్పదన్నారు. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మంచాల రమాదేవి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంగల రాంచంద్రారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి ఆదరి శ్రీనివాస్, ఏఐటీయూసీఈ జిల్లా నాయకులు ఆదరి రమేశ్ పాల్గొన్నారు.