- జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
సిద్దిపేట, వెలుగు: పేదల సంక్షేమంకోసం సీపీఐ అలుపెరగని పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. సీపీఐ శత జయంతి సందర్భంగా సిద్దిపేట శివానుభవ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శత జయంతి సభలు జరుపుకుంటున్నా, దేశంలో ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోని చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, క్యూబా వంటి దేశాల్లో పేదలకు విద్య, వైద్యం, న్యాయం అందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని, కార్మికుల హక్కులు హరించేలా పని చేస్తోందని విమర్శించారు. ఏఐటీయూసీ ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తేనే నల్ల చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని తెలిపారు. అంతకుముందు విక్టరీ టాకీస్ నుంచి శివానుభవ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మంద పవన్ , ఎడ్ల వెంకట రామిరెడ్డి, గడిపే మల్లేశ్, బట్టు దయానంద రెడ్డి పాల్గొన్నారు.