హుస్నాబాద్, వెలుగు : కేసీఆర్ పచ్చి రాజకీయ అవకాశవాది సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. వామపక్షాల బలంతో మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకొని, ఇప్పుడు తమను లెక్క చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకమని చెబుతూ తమతో కలిసి ఉండి, అసెంబ్లీ స్థానాల్లో ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించుకొని మిత్ర ధర్మాన్ని మరిచాడని దుయ్యబట్టారు. అయినా తాము భయపడేది లేదన్నారు. అన్ని స్థానాల్లో వామపక్షాల అభ్యర్థులను బరిలో నిలిపి, తమ సత్తా ఏందో చూపుతామన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ పొత్తు ధర్మాన్ని ఏనాడూ పాటించడని తెలిసినా, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతానంటేనే ఆయనతో పొత్తుకు ఒప్పుకున్నామన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కేసీఆర్..సీపీఐతో పొత్తు పెట్టుకున్నా పొత్తు ధర్మాన్ని వీడి అభ్యర్థులను నిలిపాడని గుర్తు చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో తమతో లబ్ధి పొందిన కేసీఆర్.. బీజేపీతో ప్రమాదం నుంచి గట్టెక్కి తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ పరిస్థితి ఏమయ్యేది అని ప్రశ్నించారు. అయినా ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తమకేం నష్టం లేదన్నారు. తమకు పూర్తి స్థాయిలో బలమున్న హుస్నాబాద్, కొత్తగూడెం, వైరా, బెల్లంపల్లి, మునుగోడు స్థానాలతో పాటు మిగతా అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామన్నారు. కార్యకర్తల ఒత్తిడి, జాతీయ కార్యవర్గం నిర్ణయం మేరకు పోటీలో ఉంటామన్నారు. బీజేపీని ఓడించే లక్ష్యంతో విపక్షాలు ఏర్పాటు చేసిన 'ఇండియా' కూటమిలో తాము చేరామని, ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామన్నారు. ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ సమయంలో డిమాండ్ చేసిన కేసీఆర్..ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండాలన్నారు.
ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వీరులను స్మరించుకుంటూ ఈ నెల 14 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బైరాన్‌పల్లి, గౌరవెల్లి, మహ్మదాపూర్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పారు. రాజకీయ పార్టీలతో చర్చించకుండా రాజ్యాంగ సవరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు యెడల వనేశ్, సుదర్శనాచారి పాల్గొన్నారు.