
హుస్నాబాద్, వెలుగు : మహిళల కోసం ఇప్పుడే కొత్తగా బిల్లు పెట్టినట్టు బీజేపీ గొప్పలు చెప్పుకోవడం ఎన్నికల స్టంట్ అని , ఆ బిల్లును తమ పార్టీ నాయకురాలు గీతాముఖర్జీ1996లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్లో ఏర్పాటు మీడియాతో మాట్లాడారు.
బీజేపీ రాజకీయ ప్రయోజనంతో మహిళా బిల్లు తీసుకొచ్చిందని విమర్శించారు. ఆ పార్టీని గద్దె దించేందుకు తమ పార్టీ 'ఇండియా' కూటమిలో చేరిందన్నారు. రాష్ట్రంలో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేసేందుకు అవగాహన కుదుర్చుకున్నట్టు చెప్పారు. హుస్నాబాద్, కొత్తగూడెం, వైరా, బెల్లంపల్లి, మునుగోడు లో పోటీ చేస్తామన్నారు.
జాతీయ నాయకత్వం సూచన మేరకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కల్లపెల్లి శ్రీనివాసరావు, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కార్యదర్శులు మంద పవన్, మర్రి వెంకటస్వామి, కర్రె భిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.