
హుస్నాబాద్, వెలుగు : కరువు ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో నీళ్లు పారించేందుకు ఏళ్ల తరబడి పోరాడామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్‌కు వరదకాల్వ కావాలని సీపీఐ పోరాడితేనే గౌరవెల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులు వచ్చాయన్నారు.
తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేసిన కేసీఆర్ దాని నిర్వాసితుల సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖరరెడ్డితో గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టు పనులు మొదలై చాలా వరకు పూర్తయ్యాయన్నారు. 2014లోనే సీఎం కేసీఆర్ ఇక్కడ కుర్చేసుకొని ప్రాజెక్టును పూర్తిచేస్తానని గప్పాలు కొట్టారని, పదేండ్లైనా పనులు పూర్తిచేయలేదని విమర్శించారు.
పరిహారమడిగిన నిర్వాసితులను పోలీసులతో కొట్టించిన ఘనత ఆయనదన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని హుస్నాబాద్‌లో బహిరంగసభ పెట్టుకొనేందుకు వస్తున్నారో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో పవన్, మల్లేశ్, వనేశ్, సత్యనారాయణ, భాస్కర్, సంజీవరెడ్డి, రాజుకుమార్, సృజన్‌కుమార్, శ్రీనివాస్, రాజు, సారయ్య పాల్గొన్నారు.
బీఆర్ఎస్, బీజేపీలను ఓడించడమే లక్ష్యం
కోహెడ: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్,బీజేపీలను ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. దేశంలో,రాష్ర్టంలో కుల, మతాలతో బీఆర్ఎస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. సమావేశంలో పవన్, ఎల్లయ్య, గోపి, శంకర్, లక్ష్మన్, శ్రీనివాస్‌ఉన్నారు.