కరీంనగర్ సిటీ, వెలుగు : కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్లను గద్దె దించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని సీపీఐ ఆఫీసులో ఉమ్మడి జిల్లా సీపీఐ జిల్లా నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ కార్పొరేట్ కనుసన్నల్లో పాలన చేస్తోందన్నారు.
మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలపై భారం వేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాలకు రేషన్ కార్డ్, ఇండ్లు, నిరుద్యోగ భృతి , ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.