Yuzvendra Chahal: రూ.18 కోట్లకు నేను అర్హుడనే.. నా దగ్గర ఆ వేరియేషన్ ఉంది: చాహల్

Yuzvendra Chahal: రూ.18 కోట్లకు నేను అర్హుడనే.. నా దగ్గర ఆ వేరియేషన్ ఉంది: చాహల్

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ టీమిండియాలో చోటు కోల్పోయినా ఐపీఎల్ లో చాహల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మరో 10 రోజుల్లో జరగబోయే ఐపీఎల్ లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. మూడు సీజన్ లుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ లెగ్ స్పిన్నర్.. రానున్న సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో చాహల్ ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ లెగ్ స్పిన్నర్ పై పంజాబ్ కింగ్స్ భారీ ఆశలే పెట్టుకుంది. తనకు పంజాబ్  రూ.18 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని చాహల్ చెప్పుకొచ్చాడు.
     
ఒక ఇంటర్వ్యూ లో చాహల్ మాట్లాడుతూ.. " నా మనసును నేను ప్రశ్నించుకున్నప్పుడు రూ. 18 కోట్ల రూపాయలకు నేను అర్హుడని భావించాను. నా బౌలింగ్‌లో నాలుగు రకాల వైవిధ్యాలు ఉన్నాయి. లెగ్-స్పిన్, రెండు రకాల గూగ్లీలు, ఫ్లిప్పర్ వేయగలను. నా బౌలింగ్ పై నాకు పూర్తిగా నమ్మకముంది. నేను బౌలింగ్ చేసేటప్పుడు ఆటగాళ్ల గురించి ఆలోచించను. స్టార్ ఆటగాళ్ళని భావిస్తే నాపై ఒత్తిడి పెరుగుతుంది. నా చేతిలో బంతి ఉంది.. వారి చేతిలో బ్యాట్ ఉంది. ఈ యుద్ధంలో నేను గెలవాలని కోరుకుంటాను. 

Also Read :  అలా చేయకుండా ఉండాల్సింది.. నేను చేసిన అతి పెద్ద తప్పు అదే

నేను ఆరడుగుల ఐదు అంగుళాలు ఉండకపోవచ్చు. కానీ బలంపైనే దృష్టి పెడతాను. హెన్రిచ్ క్లాసెన్, నికోలస్ పూరన్ వంటి ఆటగాళ్ళు పవర్ హిట్టింగ్  చేయగలరు. వారి బ్యాట్ అంచుకు తగిలినా సిక్సర్ వెళ్తుంది. వారు ఆరు బంతులను బౌండరీకి పంపగలరు. నేను వీరిని చాలా సార్లు ఎదుర్కొన్నాను. వారు నా బౌలింగ్ లో సిక్సర్లు కొట్టినా ఆ తర్వాత వారిని నేను ఔట్ చేయి పై చేయి సాధిస్తాను". అని చాహల్ తన మనసులోని మాటలను పంచుకున్నాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డ్ చాహల్ పేరిట ఉంది. 160 మ్యాచ్ ల్లో 205 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 

ప్రస్తుతం చాహల్ కు భారత జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2024 స్క్వాడ్ లో స్థానం దక్కినా అతనికి  ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత సెలక్టర్లు చాహల్ పూర్తిగా పక్కన పెట్టేశారు. భవిష్యత్ లోనూ చాహల్ భారత జట్టులోకి రావడం కష్టంగానే కనిపిస్తుంది. అతని వయసు 34 ఏళ్ళు కావడం దీనికి ప్రధాన కారణం. 34 ఏళ్ల చాహల్ ఇప్పటివరకు భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 217 వికెట్లు పడగొట్టాడు.