
న్యూఢిల్లీ: తన భార్య ధనశ్రీతో విడాకులు తీసుకున్న టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మళ్లీ ప్రేమలో పడ్డట్టున్నాడు. రేడియో జాకీ మహ్‌వశ్‌తో రిలేషన్‌లో ఉన్నాడన్న పుకార్లకు మరింత బలం చేకూర్చేలా ఆమెతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న చహల్‌కు మద్దతు తెలిపేందుకు మహ్‌వశ్ స్టేడియానికి వచ్చింది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో తన దోస్తులతో దిగిన ఫొటోలతో పాటు చహల్‌తో తీసుకున్న మరో ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి ‘ఏ పరిస్థితిలో అయినా మన వాళ్లకి అండగా నిలవడమే నిజమైన బంధం అర్థం. మేమంతా నీ వెన్నంటే ఉన్నాం యుజీ (చహల్)’ అని క్యాప్షన్ ఇచ్చి చహల్‌ను ట్యాగ్ చేసింది.
ఈ మెసేజ్‌కు చహల్ స్పందించాడు. ‘మీరే నా బలం. నన్ను ఎప్పుడూ నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. పైగా తన ఇన్‌స్టా స్టోరీలో మహ్‌వశ్‌తో దిగిన ఫొటోను షేర్ చేయడంతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించేశారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఇటీవల దుబాయ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా చహల్, మహ్‌వశ్ తొలిసారి జంటగా కనిపించారు. స్టేడియంలో పక్కపక్కనే కూర్చొని ఇండియా మ్యాచ్ చూశారు. దాంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు మొదలయ్యాయి.