వెనుకాలే వచ్చి.. పుస్తెలతాడు లాక్కెళ్లాడు

వెనుకాలే వచ్చి.. పుస్తెలతాడు లాక్కెళ్లాడు

గండిపేట, వెలుగు: సిటీలో వరుస చైన్ స్నాచింగ్​ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే మూడు చైన్ స్నాచింగ్​లు జరగగా, మంగళవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును లాక్కెళ్లాడో దుండగుడు. నార్సింగి పోలీసుల వివరాల ప్రకారం.. మణికొండ అల్కాపూర్‌‌ టౌన్‌‌షిప్​కు చెందిన భాగ్యలక్ష్మి మంగళవారం స్పోర్ట్స్‌‌ పార్క్‌‌ సమీపంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో వెనుక నుంచి నడుచుకుంటూ వచ్చిన ఓ దుండగుడు ఆమె మెడలోని 5 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లాడు. ఈ క్రమంలో ఆమెను రోడ్డుపై తోసేశాడు. బాధితురాలు తేరుకొని కేకలు వేసేలోపే నిందితుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పక్కనే ఉన్న ఓ ఇంటి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.