
వికారాబాద్, వెలుగు: కారులో లిఫ్ట్ఇచ్చారు.. మాయమాటలు చెప్పి, పుస్తెలతాడు చోరీ చేశారు.. సంఘటన జరిగిన 9 నెలలకు పోలీసులకు చిక్కారు.. ఈ కేసులో నలుగురిని అరెస్ట్‌చేసినట్లు నవాబుపేట ఎస్ఐ అరుణ్‌కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గతేడాది ఆగస్టు 2న నవాబుపేట మండలం మీనేపల్లి కలాన్ కు చెందిన శిలాపురం మహేశ్వరి అలియాస్అనూష తన తల్లిగారి ఊరు కేసారం వెళ్లింది. అదేరోజు తిరిగి మీనేపల్లి కలాన్ కు తన కూతురు మహర్షి, తల్లి కాంతమ్మతో కలిసి బస్సులో బయలుదేరింది.
ముగ్గురూ గేట్ వనంపల్లి గేటు వద్ద దిగారు. అదే సమయంలో వికారాబాద్ వైపు నుంచి ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్న పిల్లలు కారులో వచ్చారు. తాము ఒకే కుటుంబమని, మీ గ్రామం వైపే వెళ్తున్నామని, మిమ్మల్ని అక్కడ దింపుతామంటూ లిఫ్ట్ఇచ్చారు. వీరిలో ఓ మహిళ వెనక సీట్లో కూర్చున్న మహేశ్వరికి సీట్బెల్ట్పెడుతూ ఆమె మెడలోని మూడున్నర తులాల పుస్తెలతాడు చోరీ చేసింది. అనంతరం వారిని మాదారం పరిసరాల్లో దింపేసి, పరారయ్యారు.
కాసేపటికి మహేశ్వరి తన పుస్తెలతాడు పోయినట్లు గుర్తించి, నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అప్పటి ఎస్ఐ భరత్ భూషణ్ కేసు నమోదు చేశారు. ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశాలతో సీసీఎస్ సీఐ బలవంతయ్య ఆధ్వర్యంలోని పోలీసులు, ప్రస్తుత ఎస్ఐ అరుణ్ కుమార్, సిబ్బంది దొంగల కోసం వెతికారు. మహారాష్ట్రలోని పుణేలో ఎ-–1 సురాజ్‌ను పట్టుకున్నారు. అతను పుస్తెలతాడును గోల్డ్‌స్మిత్‌లు మచ్చింద్ర చిచాన్ కర్(ఎ–9), తన్వీర్ ఫరూక్(ఎ–10), రవిరాజ్ వినమ్ కుమార్ కోరే(ఎ–11)లకు విక్రయించినట్లు తెలిపాడు.
దీంతో, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న వీరిని శుక్రవారం అరెస్ట్ చేశారు. బాధితురాలి పుస్తెలతాడు రికవరీ చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మిగతావారు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీసీఎస్ సీఐ బలవంతయ్య, ఎస్ఐ అరుణ్ కుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.