శంషాబాద్, వెలుగు: శంషాబాద్ పరిధి ఎయిర్ పోర్ట్ కాలనీలో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. కాలనీలో దశరథ రెడ్డి, సునీత(30) దంపతులు నివసిస్తున్నారు. సునీత దివ్యాంగురాలు కావడంతో కిరాణ షాపు నిర్వహిస్తుంది. మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో కిరాణ షాపులో ఆమె ఒంటరిగా ఉంది. చైన్ స్నాచర్ వచ్చి రూ. 20 నోటు ఇచ్చి అర లీటర్ వాటర్ బాటిల్ కావాలని అడిగాడు.
తిరిగి రూ. 10 ఇచ్చేందుకు ఆమె కౌంటర్ లోంచి డబ్బులు తీస్తుండగా.. ఒక్కసారిగా చైన్ స్నాచర్ మహిళ మెడలోని 3 తులాల పుస్తెలతాడును తెంపుకొని పరార్ అయ్యాడు. ఘటన నుంచి బాధితురాలు తేరుకుని భర్తకు సమాచారం అందించిన అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ లతో గాలింపు చేపట్టారు.
వారం రోజులు కింద హమీదుల్లా నగర్ లో వ్యవసాయ పొలం మహిళ మెడలోని 4 తులాల పుస్తెలతాడు చైన్ స్నాచర్ అపహరించినది తెలిసిందే. రెండు ఘటనలను చూస్తే చైన్ స్నాచర్ ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు, 100 నంబర్ కు సమాచారం అందించాలని సూచించారు.