చైన్ ​ఎత్తుకెళ్తూ.. చెరువులో దుంకిండు

  • తప్పించుకోబోయి ఊబిలో ఇరుక్కొని చైన్​ స్నాచర్ మృతి​ 
  • పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఘటన

ముత్తారం, వెలుగు:  చోరీ చేసి తప్పించుకునే ప్రయత్నంలో చెరువులో దూకి ఊబిలో ఇరుక్కొని ఓ చైన్ స్నాచర్ మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటకు చెందిన బొంతల రాజ్‌‌కుమార్‌‌(36) గురువారం మధ్యాహ్నం మచ్చుపేటలో ఓ మహిళ నగలు ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. కుదరకపోవడంతో అక్కడి నుంచి ముత్తారం మండలం సర్వారం గ్రామానికి వెళ్లాడు. కిరాణ షాపులో ఉన్న ఓ మహిళను పెట్రోల్‌‌ కావాలని అడిగాడు. ఆమె పెట్రోల్‌‌ పోసి డబ్బులు తీసుకొని చిల్లర తెచ్చేందుకు లోపలికి వెళ్లింది. 

రాజ్‌‌కుమార్‌‌ ఆమె వెంటే షాపులోకి వెళ్లి దాడి చేసి, మెడలో పుస్తెలతాడు లాక్కొని వెళ్లాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అతడిని వెంబడించారు. తప్పించుకునే క్రమంలో రాజ్‌‌కుమార్​ బైక్‌‌ను అక్కడే వదిలేసి పొలాల మీదుగా పారిపోతూ.. మైదంబండ చెరువులో దూకాడు. చెరువు ఊబిలో ఇరుక్కుపోయి చనిపోయాడు. గోదావరిఖని ఏసీపీ శ్రీనివాస రావు, ఎస్ఐ సతీష్ వచ్చి  గ్రామస్తుల సాయంతో రాజ్‌‌కుమార్‌‌ డెడ్‌‌బాడీని బయటకు తీశారు. అతనిపై సుమారు 10 కేసులు  ఉన్నట్లు పోలీసులు చెప్పారు. మృతుడికి భార్యతోపాటు కూతురు ఉన్నారు.