నిజామాబాద్ లో చైన్​ స్నాచర్ల ముఠా అరెస్ట్​ : ఏసీపీ రాజావెంకట్​రెడ్డి 

నిజామాబాద్ లో చైన్​ స్నాచర్ల ముఠా అరెస్ట్​ : ఏసీపీ రాజావెంకట్​రెడ్డి 

నిజామాబాద్, వెలుగు: అద్దెకుంటున్న ఓనర్​ ఇంట్లో చోరీ చేయడంతో పాటు జిల్లాలో జరిగిన నాలుగు చైన్​ స్నాచింగ్​ కేసులు, మూడు బైక్​లను అపహరించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు నగర ఏసీపీ రాజావెంకట్​రెడ్డి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర ధర్మాబాద్​ రాంనగర్​కు చెందిన శేక్​ ఇమ్రాన్​, నాందేడ్​కు చెందిన అమన్, బాసర శారదానగర్ వాసి  శేక్​ అర్బాజ్ ముఠాగా ఏర్పడి నగరంలో అద్దె ఉంట్లో ఉంటూ చైన్​స్నాచింగ్​తో పాటు బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. 

కిరాయికి ఉంటున్న ఇంటి యజమాని ఇంట్లో కూడా చోరీ చేశారు. వీరిపై ఎనిమిది కేసులు నమోదు కాగా, 50 గ్రాముల బంగారం, ఒక బైక్ రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. శ్రీనగర్​ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శేక్​ ఇమ్రాన్​, శేక్​ అర్బాజ్​ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాలు ఒప్పుకున్నారన్నారు. అమన్​ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. సమావేశంలో టౌన్​ సీఐ శ్రీనివాస్​రాజు, సీసీఎస్​ ఇన్​స్పెక్టర్​ సురేష్​, ఫోర్త్​ టౌన్​ ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.

40 కేసుల్లో నిందితుల అరెస్టు

ఈనెల 5న నగరంలోని శ్రీసాయి బాలాజీ ట్రాన్స్​పోర్ట్​ ఆఫీస్​లో చోరీకి పాల్పడిన నలుగురు నిందితులు శేక్​సాదక్​, సురేకర్​ ప్రకాష్​, శేక్​ షాదుల్లా, సాయినాథ్​ విఠల్​రావు ముక్తేను అరెస్టు చేసి రూ.10.17 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి తెలిపారు. వారిపై నగరంలోని పలు స్టేషన్లతో పాటు డిచ్​పల్లి, బోధన్​, బాన్స్​వాడ ఠాణాల్లో చోరీలతోపాటు మర్డర్​, అటెంప్ట్​ మర్డర్​, ఫొక్సో కేసులు కలిపి మొత్తం 40 కేసులు నమోదైనట్లు ఏసీపీ పేర్కొన్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు ఆటోరిక్షా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.