
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్‌బీ కాలనీలో పొద్దున ఆరు గంటలకే చైన్స్నాచింగ్జరిగింది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళను మభ్యపెట్టిన దుండగుడు ఇంట్లోకి చొరబడి బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. ఈ స్నాచింగ్దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కేపీహెచ్‌బీ పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ వేంకటేశ్వరస్వామి టెంపుల్ ఎదురు లైన్‌లోని ఈడబ్ల్యూఎస్998 గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసిస్తున్న అంజలి(50) బుధవారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. అదే సమయంలో ముఖానికి మంకీ క్యాప్,చేతిలో ఖాళీ వాటర్‌బాటిల్ పట్టుకొని వచ్చిన ఆగంతకుడు తొలుత ఆమెను ఏదో అడ్రస్అడిగాడు.
ఆ తర్వాత తనకు దాహం వేస్తుందని, మంచినీళ్లు అడిగాడు. అతనిపై జాలి పడిన మహిళ ముగ్గు డబ్బాని పక్కన పెట్టి, నీళ్ల కోసం ఇంట్లోకి వెళ్లింది. ఆమె వెనకాలే బాటిల్పట్టుకుని ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. బాధితురాలు పెద్దగా కేకలు వేస్తూ వెంటపడినా దొరకలేదు. దీంతో బాధితురాలు ఫిర్యాదుతో నమోదు చేసుకుని కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.