ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై స్నాచర్ దాడికి పాల్పడ్డాడు. కంట్లో స్ప్రే చేసి.. పిడి గుద్దులతో దాడి చేసి చైన్ లాక్కొని వెళ్ళాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 2లోని ఓం శ్రీ సాయి నిలయం పై పోర్షన్ లో వెంకట యజ్ఞ కుమారి(50) అనే మహిళ ఉంటోంది.
ఒంటరిగా ఉన్న ఆమె బట్టలు సర్దుతుండగా గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ వేసుకొని ఇంటిలోకి వస్తూనే స్ప్రే చేశాడు. అరుపులు, కేకలు వేయొద్దంటూ పీక నొక్కి కంటిపై పిడి గుద్దులు గుద్దాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసును తెంపుకెళ్లాడు. సమాచారం అందుకున్న క్రైమ్ అడిషనల్ డీసీపీ నరసింహా రెడ్డి ఘటనా స్ధలిని పరిశీలించారు. స్నాచర్ ను పట్టుకోవడానికి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.