దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న యువజంట సీసీ కెమెరాలకు చిక్కగా, ప్రత్యేక పోలీస్ బృందాలు వారి కోసం గాలింపు చేపట్టాయి. దేవరకొండ డీఎస్పీ ఆఫీసులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ గిరిబాబు వివ రాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం యేరుగండ్లపల్లికి చెందిన సాతు సునీత శుక్రవారం సాయంత్రం తన పొలంలో వ్యవసాయ పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేందుకు రోడ్డుపై నిలబడింది.
ఈ క్రమంలో స్కూటీపై అక్కడికి వచ్చిన ఓ ప్రేమజంట మర్రిగూడకు ఎలా వెళ్లాలని అడిగారు. యేరుగండ్లపల్లి వరకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి స్కూటీపై ఎక్కించుకున్నారు. దారి మధ్యలో మూత్రం వస్తుందని చెప్పి యువకుడు స్కూటీపై నుంచి దిగాడు. వెంటనే అతనితో ఉన్న యువతి సునీత మెడలో నుంచి నాలుగు తులాల బంగారు చైన్ లాగేసింది.
ఆ తర్వాత ఇద్దరు స్కూటీపై పారిపోయారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు జంటను వెంబడించారు. కానీ, అప్పటికే వాళ్లు తప్పించుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ పుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతుంది ప్రేమజంటగా గుర్తించి.. వారిని పట్టించుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.