ఏడుపాయల పాలక మండలి ప్రమాణ స్వీకారం

ఏడుపాయల పాలక మండలి ప్రమాణ స్వీకారం
  •     చైర్మన్​గా బాలాగౌడ్
  •     కార్యక్రమానికి డుమ్మా కొట్టిన ఈవో

పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పాలక మండలి నూతన చైర్మన్​ బాలాగౌడ్​ అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం పాలక మండలి సోమవారం  కొలువుదీరింది. 14 మంది ధర్మకర్తలు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడితో కొలువుదీరిన పాలక మండలితో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్స్​పెక్టర్ రంగారావు  సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పాలక మండలి సభ్యులలో ఒకరైనా గాజులగూడెం గ్రామానికి చెందిన సాతెల్లి బాలాగౌడ్ ను  చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఆయన పేరును ధర్మకర్త యాదగౌడ్​ ప్రతిపాదించగా ఉప్పరి వెంకటేశం బలపర్చారు. పోటీలో ఎవరు లేకపోవడంతో బాలాగౌడ్ ను  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

ఈ మేరకు ఇన్స్​పెక్టర్​ రంగారావు ఆయనను చైర్మన్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం బాలాగౌడ్ మాట్లాడుతూ ఏడుపాయల ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయమని, ధర్మకర్తల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆలయం వద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పాలక మండలి సభ్యులు వీరే...

పాలక మండలిలో 14మంది ధర్మకర్తలతో పాటు ఆలయ పూజారిని ఎక్స్అఫీషియో సభ్యుడిగా నియమించారు. ధర్మకర్తలలో 11 మంది పాపన్నపేట మండలానికి చెందిన వారు కాగా, ఇద్దరు కొల్చారం, ఒకరు మెదక్  చెందిన వారు ఉన్నారు. సాతెల్లి బాలాగౌడ్ చైర్మన్ (గాజులగూడెం), కాశమొల్ల శ్రీనివాస్ రావు (ఆరేపల్లి), బూసనెల్లి మాణేమ్మ (నాగ్సాన్పల్లి), ఉప్పరి వెంకటేశం. (పాపన్నపేట), నీరుడి సిద్దిరాములు (ఎల్లాపూర్), ఉప్పరి పెంటయ్య (నార్సింగి), అంబట్ మోహన్ రావు (కుర్తివాడు), దొడ్ల మనోహర్ (కొత్తపల్లి), నాయికోటి సాయిలు (కొత్తలింగాయిపల్లి), మారుమాల నాగభూషణం (కొడుపాక), పోతుగంటి రఘువీర్ (పొడ్చన్పల్లి), కొమ్ముల యాదాగౌడ్ (పోతంశెట్టిపల్లి), రాజిపేట బాగారెడ్డి (చిన్నఘనపూర్), రాగి చక్రపాణి (మెదక్), ఎక్స్ అఫీషియో సభ్యుడు ఆలయ పూజారి శంకరశర్మ ఉన్నారు. వీరు ఏడాదిపాటు పదవీలో ఉంటారు.  గతేడాది 13 మందితో పాలక మండలి ఉండగా ఈ సారి 14మందికి అవకాశం కల్పించారు 

సాదాసీదాగా ప్రమాణ స్వీకారం

సోమవారం ఏడుపాయలలో జరిగిన  నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం సాదాసీదాగా జరిగింది. గతంలో ఎప్పుడు ప్రమాణ స్వీకారం జరిగినా ఎంతో ఆర్బాటంగా జరిగేంది.  ఈసారి కనీసం మండలంలోని బీఆర్​ఎస్​ నేతలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు.  ప్రమాణ స్వీకారానికి  ఆలయ ఈవో సైతం డుమ్మా కొట్టారు. ఈ కార్యక్రమం ఉన్నా ఆయన తిరుపతి వెళ్లాడంపై పలువురు విమర్శిస్తున్నారు.