ఆరోగ్యకర సమాజ నిర్మాణమే ధ్యేయం : గోలి శ్రీనివాస్ రెడ్డి

ఆరోగ్యకర సమాజ నిర్మాణమే ధ్యేయం : గోలి శ్రీనివాస్ రెడ్డి
  •     రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి 
  •     రంగారెడ్డి- జిల్లాలో అంగన్ వాడీలు, స్కూళ్లు, రేషన్ షాపుల తనిఖీ

రంగారెడ్డి, వెలుగు : ఆరోగ్యకర సమాజ నిర్మాణమే రాష్ట్ర ఫుడ్ కమిషన్ ధ్యేయమని చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.  పేదలకు పౌష్టికాహారం అందేలా అన్నివర్గాల ప్రజలు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పలు రేషన్ షాపులు, అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల్లో ఫుడ్ కమిషన్ సభ్యుల బృందం శుక్రవారం తనిఖీలు చేసింది. 

చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం, రేషన్ షాపుల ద్వారా ఆహార భద్రత కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం, నిత్యావసరాలు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. సంబంధిత అధికారులతో సమావేశమై పౌష్టికాహార పంపిణీపై సమీక్షించారు. అనంతరం కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో పుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు, అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా పుడ్ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కు పకడ్బందీగా అమలయ్యేలా పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఏర్పాటు అయిందన్నారు. ప్రజలకు హక్కుగా అందించాల్సిన పౌష్టికాహారాన్ని సరిగా అమలు చేయకుంటే జిల్లా స్థాయిలో డీఆర్డీఏ పీడీకి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. తగు న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఫుడ్ కమిషన్ ను సంప్రదించవచ్చని తెలిపారు. శిశువులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, విద్యార్థులు, నిరుపేదలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించి ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి దోహదపడాలని చైర్మన్ పిలుపునిచ్చారు. 

ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు ఆనంద్, గోవర్ధన్ రెడ్డి, శారద, భారతి, జ్యోతి, డీఆర్ఓ సంగీత, పీడీ డీఆర్డీఏ శ్రీలత, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మజా రమణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, జిల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్ ఉదయ్ కుమార్, జడ్పీటీసీ శ్రీలత, ఎమ్ఆర్ఓ రవీందర్ రెడ్డి, ఎంపీడీఓ అరుంధతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.