త్వరలోనే 8 జిల్లాల్లో ఆయిల్​ పామ్​ ఇండస్ట్రీలు

త్వరలోనే 8 జిల్లాల్లో ఆయిల్​ పామ్​ ఇండస్ట్రీలు
  •  తెలంగాణ ఆయిల్​ సీడ్స్ గ్రోయర్స్​ ఫెడరేషన్​ చైర్మన్​ జంగా రాఘవరెడ్డి 

 

హనుమకొండ, వెలుగు:   ప్రభుత్వం ఆయిల్​ పామ్​ సాగును ప్రోత్సహిస్తోందని, త్వరలోనే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఆయిల్​ పామ్​ ఇండస్ట్రీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఆయిల్ సీడ్స్​ గ్రోయర్స్​ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి వెల్లడించారు. ధర్మసాగర్​ మండలం టేకులగూడెంలోని తన ఆఫీస్​ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్​ పామ్​ ​ సాగు ద్వారా  ఎకరాకు  రూ. 1.50 లక్షల నుంచి 1.80 లక్షల వరకు ఆదాయం ఉంటుందన్నారు.  మార్కెటింగ్​ లేదంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల ప్రైవేటు కంపెనీలు వచ్చినట్లు గుర్తు చేశారు. గతంలో డీసీసీబీ చైర్మన్​ గా రైతులకు సేవచేసినట్టే.. 

ఇప్పుడు  ఆయిల్ పామ్ రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  రైతులకు రవాణా, స్టోరేజీ, గిట్టుబాటు ధర కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. ఆయిల్​ ఫామ్​ లో నాలుగేండ్లు కష్టపడితే, ఆ తరువాత నుంచి ఆదాయం వస్తుందన్నారు.  ఆయిల్ ఫామ్ పంటలకు వాడే డ్రిప్ ఇరిగేషన్ కి సేల్స్ టాక్స్ ను రద్దు చేయాల్సిందిగా  కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. 

ప్రస్తుతం 30 లక్షల ఆయిల్ ఫామ్ మొక్కలు రెడీగా ఉన్నాయని,  ఇప్పుడున్న వెయ్యి కోట్ల టర్నోవర్ ను సంవత్సర కాలంలో 2 వేల కోట్లకు చేర్చేందుకు  కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతోందని, అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత అన్నివర్గాలు బాగుపడతాయనుకుంటే.. ఉద్యమకారులకు ఎక్కడా న్యాయం జరగలేదన్నారు. బీఆర్​ఎస్​ పాలనలో తెలంగాణ దొరల పాలైందని మండిపడ్డారు.