- మౌలాలీలో ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్లు, పేపర్ బాయ్‌ల రెండో మహాసభలు
- హాజరైన మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్లు, పేపర్ బాయ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మీడియాఅకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మౌలాలీలోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ రెండో మహాసభలు బుధవారం జరిగాయి. ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్లు, పేపర్ బాయ్‌ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అధ్యక్షుడు వనమాల సత్యం మాట్లాడుతూ.. దినపత్రిక రంగంలో పనిచేస్తున్న తమకు 80 శాతం సబ్సిడితో ఈ చార్జింగ్, మోటర్ సైకిళ్లను ఇవ్వాలన్నారు. ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూటర్లు, పేపర బాయ్‌ల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. పత్రికల లోడింగ్, పంపిణీ కోసం రైతు బజార్ల మాదిరిగా ప్రత్యేక షెడ్‌లను నిర్మించాలని ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్‌రావు కోరారు. రూ.10 లక్షల ఆరోగ్య బీమా, రూ.20 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న వారందరూ పేదవారేనన్నారు. కార్మికశాఖ నుంచి తమకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఆసరా పథకంలో ప్రత్యేక కేటగిరిగా చేర్చి పెన్షన్ ఇవ్వాలని కోరారు.