
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ కులగణనను అడ్డుకుంటున్నది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలేనని తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. రజకుల సమస్యల పరిష్కారానికి సీఎం అనుకూలంగా ఉన్నారని, రజక సంఘాలు ఐక్యంగా ముందుకు వచ్చి హక్కులను సాధించుకోవాలని సూచించారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజక ఫిషర్మెన్రాష్ట్ర సొసైటీల కమిటీ ఆత్మీయ సభ సొసైటీ చైర్మన్ ఆమనగంటి సైదులు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ రజకులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రజకులకు ఉపాధి కల్పన కోసం ఫిషర్మెన్ సొసైటీలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల పక్షపాతి అని.. ఏ ప్రభుత్వం చేయలేని పనిని ఆయన చేశారని.. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తన గొప్పతనం చాటుకున్నారని కొనియాడారు. ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు చాకలి రామస్వామి, రాజశేఖర్, కాశీరాం, రాజీవ్ పాల్గొన్నారు.