- యాదాద్రి ప్లాంట్ నిర్మాణ టెండర్లపై విచారణ జరిపాం: జస్టిస్ నరసింహారెడ్డి
- ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపే రిపోర్టు అందజేస్తామని వెల్లడి
- యాదాద్రి థర్మల్ ప్లాంట్ను సందర్శించిన జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్
మిర్యాలగూడ, వెలుగు : గత సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ అవకతవకల ఆరోపణలపై విచారణను వేగవంతం చేసినట్టు జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో చేపడుతున్న నిర్మాణ పనులను టెండర్లు పిలవకుండానే బీహెచ్ఈఎల్కు పెద్ద మొత్తంలో అప్పగించడం, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల ఒప్పందం, చత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకల ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేస్తున్నామని తెలిపారు.
న్యాయ విచారణలో భాగంగా శనివారం ఆయ న యాదాద్రి థర్మల్ ప్లాంట్ను సందర్శించారు. ఈ ప్లాంట్ నిర్మాణ పనులకు సంబంధించిన సాంకేతిక వివరాలను సేకరించారు. ప్లాంట్లో బీహెచ్ఈఎల్ సహా ఇతర కాంట్రాక్ట్ సంస్థలకు మధ్య జరిగిన అగ్రిమెంట్ల రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్లాంట్ అధికారులతో సమావేశమయ్యారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి టెండర్లు ఎందుకు పిలవలేదో విచారణ జరిపినట్లు ఆయన చెప్పారు.
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై కూడా విచారణ జరుగుతున్నదన్నారు. భద్రాద్రి, యాదాద్రి, పీపీఏల వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాల వెనుక భాగస్వాములైన వారందరికీ నోటీసులు ఇచ్చామని, ప్రజల అభిప్రాయాలను తీసుకునేందుకు నోటీసులు ఇచ్చామన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలింగ్ తర్వాత నోటీసులు ఇచ్చామని తెలిపారు. చాలామంది వారి అభిప్రాయాలను తమకు చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపే రిపోర్టు అందజేస్తామని తెలిపారు.