ఫోన్​ ట్యాపింగ్​పై పెట్టిన శ్రద్ధ​కులగణనపై పెట్టుంటే కేసీఆర్ ​గెలిచేటోడు

ఫోన్​ ట్యాపింగ్​పై పెట్టిన శ్రద్ధ​కులగణనపై పెట్టుంటే కేసీఆర్ ​గెలిచేటోడు
  • రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య విమర్శ
  • తమ వాటా అడగనంత కాలం బీసీలు అలాగే ఉంటరు: కేకే

ఖైరతాబాద్, వెలుగు: సమగ్ర కులగణనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రిటైర్డ్​జస్టిస్, జాతీయ బీసీ కమిషన్​మాజీ చైర్మన్​వి.ఈశ్వరయ్య చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ప్రాతినిధ్యం వహించే హక్కు ఉండాలన్నారు. ​‘కులగణన.. రిజర్వేషన్లు.. శాస్త్రీయ అవగాహన’ పేరుతో ప్రొఫెసర్​జి.లక్ష్మణ్​రాసిన పుస్తకాన్ని బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా ఈశ్వరయ్య పాల్గొని మాట్లాడారు. కులగణన అనేది సున్నితమైన అంశమన్నారు. 

అటు కోర్టుల్లో, ఇటు పార్లమెంటులో ఎక్కడా బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. కేసీఆర్​ ఫోన్​ ట్యాపింగ్​పై పెట్టిన శ్రద్ధ.. కులగణనపై పెట్టి ఉన్నట్లయితే మరోసారి గెలిచేవారని, ఆయనకు పూర్వవైభవం వచ్చేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు మాట్లాడుతూ.. తమ వాటా తమకు కావాలని అడగనంత కాలం బీసీలు ఇలాగే ఉంటారని చెప్పారు.

బీసీలది కుల ఉద్యమం కాదని, ప్రజాస్వామ్య ఉద్యమమని రచయిత లక్ష్మణ్​పుస్తకంలో రాశారన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ..సమాజంలో సగ భాగమైన బీసీల లెక్కలు ఎందుకు చూడట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో జూలూరు గౌరీశంకర్, రౌతు కనకయ్య, దేవుళ్ల సమ్మయ్య, ఆకుల రజిత, దుర్గం రవీందర్, వనమాల చంద్రశేఖర్​ తదితరులు పాల్గొన్నారు.